నాల్గో స్థానంలో రాహుల్‌ వచ్చాడు..

25 May, 2019 15:38 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం ఇక్కడ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు విఫలమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే రోహిత్‌, ధావన్‌ వికెట్లను నష్టపోయింది. ముందుగా ఆరు బంతులు ఆడిన రోహిత్‌ రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో భారత జట్టు మూడు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆపై ధావన్‌(2) కూడా పెవిలియన్‌ చేరాడు. బౌల్ట్‌ వేసిన నాల్గో ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ ఔటయ్యాడు.

ఫలితంగా పది పరుగులకే టీమిండియా రెండు ప్రధాన వికెట్లను నష్టపోయింది. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, కేఎల్‌ రాహుల్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దాంతో వరల్డ్‌కప్‌లో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు చేస్తారు అనే దానిపై టీమిండియా దాదాపు స్పష్టత ఇచ్చినట్లే కనబడుతోంది. కాగా, రాహుల్‌(6) మాత్రం నిరాశ పరిచాడు. 10 బంతులు ఆడిన రాహుల్‌ ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ వికెట్‌ను కూడా బౌల్ట్‌ ఖాతాలో వేసుకోవడం విశేషం. బౌల్ట్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 24 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మరిన్ని వార్తలు