'కేఎల్ రాహుల్ గైర్హాజరీ భారీ నష్టం చేసింది'

9 May, 2017 18:35 IST|Sakshi
'కేఎల్ రాహుల్ గైర్హాజరీ భారీ నష్టం చేసింది'

బెంగళూరు:ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవమైన ప్రదర్శనకు సంబంధించిన కారణాలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ విశ్లేషించాడు. ఆర్సీబీ చివరిస్థానంలో నిలవడానికి కెప్టెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ల చెత్త ప్రదర్శన ఒక కారణమైతే, కేఎల్ రాహుల్ గైర్హాజరీ మరొక కారణమన్నాడు. ఒక కీలక ఆటగాడు ఆర్సీబీకి అందుబాటులో లేకుండా పోవడం ఆ జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పాంటింగ్ పేర్కొన్నాడు.

 

'కేఎల్ రాహుల్ లేకపోవడం ఆర్సీబీకి భారీ నష్టం చేసింది. గతేడాది ఆర్సీబీ ఫైనల్ కు చేరడంలో రాహుల్ పాత్ర వెలకట్టలేనిది. ఈసారి టాపార్డర్ లో రాహుల్ లేకపోవడం ఆర్సీబీ తడబడింది. గడిచిన ఐపీఎల్ ప్రదర్శన ఇక్కడ ప్రస్తుతానికి అనవసరం. అయితే ఐపీఎల్ ఆరంభమయ్యే వరకూ రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కచ్చితంగా రాహుల్ లేకపోవడం ఆర్సీబీ దురదృష్టం'అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

 

భుజం గాయంతో రాహుల్ ఐపీఎల్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరిస్ లో రాహుల్ భుజానికి గాయమైంది. దాంతో ఐపీఎల్ నుంచి రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.సిరీస్‌ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నా అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఐపీఎల్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు.

>
మరిన్ని వార్తలు