‘అతని బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం కష్టం’

11 May, 2020 13:04 IST|Sakshi

ధోని  నుంచి క్యాప్‌ అందుకోవడం ప్రత్యేకం

గేల్‌ ఒక స్మార్ట్‌ క్రికెటర్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్న క్రికెటర్లు చిట్‌చాట్‌లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తమ క్రికెట్‌ అనుభవాలను నెమరువేసుకుంటూ రాబోవు సీజన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటానికి పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో చెప్పలేకపోయినా త్వరలోనే అంతా సర్దుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు. కాగా,  తన బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ తనదైన మార్కు వేసిన కేఎల్‌ రాహుల్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. అనూహ్యంగా టీమిండియా కీపింగ్‌ బాధ్యతలు చేపట్టి జాతీయ జట్టులో రెగ్యులర్‌ కీపర్‌ స్థానంపై కన్నేసిన రాహుల్‌.. తన గత అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో భాగంగా వికెట్‌ కీపింగ్‌  చేసేటప్పుడు ఎవరి బౌలింగ్‌ కఠినంగా ఉంటుందనే  ప్రశ్నకు బుమ్రా అనే సమాధానమిచ్చాడు రాహుల్‌.(కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!

బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల వెనకాల కీపింగ్‌ చేయడం చాలా కష్టమన్నాడు. బుమ్రా పేస్‌ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడం అంత ఈజీ కాదన్నాడు. అయితే వైట్‌బాల్‌ క్రికెట్‌లో తన కెరీర్‌ మలుపు తిరగడానికి 2016 ఐపీఎల్‌ కారణమన్నాడు.  ఆ సీజన్‌ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించడంతో తన కెరీర్‌ గాడిలో పడిందనేది వాస్తవమన్నాడు. అయితే తన ఐపీఎల్‌ ఫేవరెట్‌ డ్రెస్సింగ్‌  రూమ్‌ మూమెంట్‌ ఏదైనా ఉందంటే అది వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌తోనేనని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. గేల్‌తో తనకు ఎప్పుడూ బాగుంటుందన్నాడు. అందరితోనే గేల్‌ సరదాగా ఉంటాడన్నాడు. అతనొక స్మార్ట్‌ క్రికెటర్‌ అని, గేమ్‌ గురించి కచ్చితమైన ప్రణాళికతో ఉంటాడన్నాడు. ఇక 2014 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఎంఎస్‌ ధోని నుంచి టెస్టు క్యాప్‌ను అందుకోవడం తనకు ఒక స్పెషల్‌ మూమెంట్‌  అని పేర్కొన్నాడు. అది అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్‌ కావడంతో ఎప్పటికీ ఒక ప్రత్యేక క్షణంగానే గుర్తుండి పోతుందన్నాడు. గతేడాది చివర్లో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ గాయపడటంతో కీపింగ్‌ బాధ్యతల్ని  రాహుల్‌కు అప్పచెప్పారు.అప్పట్నుంచీ పంత్‌ అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు రాహుల్‌. అటు బ్యాటింగ్‌,ఇటు కీపింగ్‌ల్లో ప్రత్యేక ముద్రతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దాంతో పంత్‌ రిజర్వ్‌ బెంచ్‌లోనే కూర్చోవాల్సి వస్తుంది. (‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’)

>
మరిన్ని వార్తలు