రాహుల్ రికార్డులు

28 Aug, 2016 10:52 IST|Sakshi
రాహుల్ రికార్డులు

లాడర్‌హిల్ (ఫ్లోరిడా): వెస్టిండీస్ తో శనివారం జరిగిన తొలి టి20లో ఫస్ట్ సెంచరీ బాదిన టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ పలు ఘనతలు సాధించాడు. టి20లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా డ్లు ప్లెసిస్(దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా
రెండో స్థానంలో నిలిచాడు. 46 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో రాహుల్ తొలి టి20 శతకం పూర్తిచేశాడు. టి20లో వేగవంతమై సెంచరీ రికార్డు రిచర్డ్‌ లెవి (దక్షిణాఫ్రికా) పేరిట ఉంది. అతడు 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

భారత్ తరఫున టి20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ గా ఘనతకెక్కాడు. అతడి కంటే ముందు రోహిత్ శర్మ, రైనా ఒక్కో సెంచరీ చేశారు. అంతేకాదు సురేశ్‌ రైనా తర్వాత మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు. మరోవైపు మూడు ఫార్మాట్లలోనూ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ రికార్డు సృష్టించడం మరో విశేషం. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రాహుల్(110)దే కావడం మరో విశేషం. అంతకుముందు  దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ నమోదు చేసిన 106 పరుగులే అంతర్జాతీయ టీ 20ల్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు.

రాహుల్ సునామీ ఇన్నింగ్స్ తో విండీస్ తో జరిగిన తొలి టి20లో ధోని సేన పోరాడి ఓడింది. కేవలం ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓడినప్పటికీ ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. ముఖ్యంగా రాహుల్ పోరాటం మన్ననలు అందుకుంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిపి 489 పరుగులు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు