బయో సెక్యూర్‌ క్రికెట్‌ సాధ్యమేనా?

3 Jul, 2020 16:15 IST|Sakshi

సౌతాంప్టన్‌: కరోనా సంక్షోభం.. యావత్‌ ప్రపంచాన్ని నేటికీ అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇప్పటికీ కరోనా వైరస్‌ ప్రభావం తగ్గకపోవడంతో ఇక అది తమ జీవన విధానంలో భాగంగానే ప్రపంచం భావిస్తోంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ప్రతీ షెడ్యూల్‌ను వాయిదా వేస్తూ ముందుకు సాగడం కష్టసాధ్యంగా మారిన క్రమంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తులు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక క్రీడా ఈవెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్రీడలు జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులు ఉండాలి. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరపడానికి ఆయా క్రీడా సమాఖ్యలు సిద్ధమవుతున్నా అసలు ప్రజలే స్టేడియాలకు వెళ్లే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పటికే క్రికెట్‌ టోర్నీలు నిర్వహించడానికి సలైవా(లాలాజలాన్ని బంతిపై రద్దడాన్ని)ను బ్యాన్‌ చేసిన ఐసీసీ.. ఇంకా పకడ్భందీగా మ్యాచ్‌లు జరపాలని చూస్తోంది. ఇక నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే వేదికల్లో బయో సెక్యూర్‌ విధానాన్ని అవలంభించాలని చూస్తోంది. ఇందుకు ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి సిద్ధమైంది.

క్రికెట్‌లో బయో సెక్యూర్‌ ఏమిటి?
ప్రాణాంతకమైన ఒక  వైరస్‌ను‌ విస్తరించకుండా చేయడం లేదా.. అసలు అక్కడ వైరస్‌ ఉనికే లేకుండా చేయడం. దీని కోసం బయో సెక్యూర్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)తో పాటు ఐసీసీ కట్టుదిట్టంగా ప్రణాళికలు రచిస్తోంది. ముందు సాధ్యమైనంత వరకూ వేదికల్ని కుదించడం. అంటే ఆటగాళ్లను ఎక్కువ ప్రయాణాలు చేయకుండా నివారించడం ఒకటి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ల తొలి టెస్టు సౌతాంప్టన్‌లో జరుగుతుండగా, రెండు, మూడు టెస్టులు మాంచెస్టర్‌లో నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మూడో టెస్టు లార్డ్స్‌లో జరగాల్సి ఉండగా దానిని మాంచెస్టర్‌కు పరిమితం చేశారు. ఈ స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. దాంతో ఇతరులు హోటళ్లకు రాకుండా చర‍్యలు తీసుకుంటారు. కేవలం ఆటగాళ్లు మాత్రమే ఉండే విధంగా చూస్తారు. ఆటగాళ్లు సైతం క్రికెటర్లు హోటళ్లు దాటి బయటకు వెళ్లకూడదు. మరొకవైపు మ్యాచ్‌ జరిగేటప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరు తాకకూడదు. సెలబ్రేషన్స్‌ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కేవలం  ఇలా క్రికెట్‌ మ్యాచ్‌ బయో సెక్యూర్‌ వాతావరణంలో జరగాలన్న మాట. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. (‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’)

ఇది సాధ్యమేనా?
మరి బయో సెక్యూర్‌ విధానం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇంగ్లండ్‌  వంటి దేశాల్లో దీనికి అనుకూలంగా ఉన్నా వేరే దేశాల్లో మాత్రం ఇది కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న క్యాలెండర్‌ ప్రకారం అందరికీ అది సాధ్యపడదని అంటున్నారు. ఆటగాళ్లను హెటళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేయడం వరకూ ఓకే కానీ, క్రికెట్‌ స్టేడియాలకు ఆనుకుని హోటళ్లు అన్ని చోట్ల ఉండవనేది వారి వాదన. మరొకవైపు ఇతరులను హోటళ్లకు అనుమతి లేకుండా చేయాలంటే అందుకు అయ్యే ఖర్చులను క్రికెట్‌ బోర్డులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకండా క్రికెట్‌ టోర్నీలు నిర్వహించి బోలెడంత నష్టం చూడటానికి సిద్ధమైన బోర్డులు.. అదనపు ఖర్చును భరించడం అంటే తలకు మించిన భారమే అవుతుందని అంటున్నారు. ఈ విధానం అన్ని చోట్లా వర్కౌట్‌ కాదని రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయ పడటం ఇక్కడ గమనించాల్సిన అంశం. 

మరిన్ని వార్తలు