ఆ విధ్వంసక జెర్సీలు వేలానికి...

25 Apr, 2020 04:24 IST|Sakshi

కోహ్లి, డివిలియర్స్‌ల సమష్టి నిర్ణయం 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2016లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్లు కోహ్లి, డివిలియర్స్‌ సృష్టించిన సెంచరీల విధ్వంసం అభిమానుల మనసుల్లో చెక్కుచెదరలేదు. ఈ మ్యాచ్‌లో ఏబీ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలవగా... 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కోహ్లి 109 పరుగులు చేశాడు. పర్యావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆ రోజు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గ్రీన్‌ జెర్సీలతో బరిలోకి దిగింది. నాటి మ్యాచ్‌లో తాము ఆడిన బ్యాట్లు, జెర్సీలతో పాటు ఇతర కిట్‌లను కూడా వేలానికి ఉంచుతున్నట్లు కోహ్లి, డివిలియర్స్‌ ప్రకటించారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని కోవిడ్‌–19 సేవా కార్యక్రమాలకు అందిస్తామని తమ మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రా మ్‌ చాటింగ్‌లో వీళ్లిద్దరు వెల్లడించారు.

తమ సంతకాలతో ఉండే ఈ జ్ఞాపికలు అభిమానులు అపురూపంగా దాచుకోవచ్చని అన్నారు. 2011 ఐపీఎల్‌నుంచి ఒకే జట్టులో సభ్యులుగా ఉన్న విరాట్, డివిలియర్స్‌ పలు ఆసక్తికర అంశాలు ముచ్చటించుకోగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ చాటింగ్‌ను అనుసరించారు. తొలిసారి ఆర్‌సీబీ జట్టుతో చేరినప్పుడు ఇన్నేళ్లు వారితో ఉంటాననే నమ్మ కం తనకు కనిపించలేదని ఏబీ గుర్తు చేసుకోగా... తాను ఎప్పటికీ బెంగళూరు టీమ్‌ను వీడను, మరో జట్టుకు ఆడనని కోహ్లి స్పష్టం చేశాడు. 2016 ఫైనల్లో ఓడిన బాధ తమను ఇప్పటికీ వెంటాడుతుందని వారిద్దరు చెప్పారు. తమ మధ్య స్నేహం కాలానికి అతీ తమైందని ఏబీ వ్యాఖ్యానించగా... నమ్మకమే తమ స్నేహానికి బలమని కోహ్లి జవాబిచ్చాడు. 

మరిన్ని వార్తలు