కోహ్లి, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో?

17 Sep, 2019 10:46 IST|Sakshi

కోల్‌కతా:  ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ  క్రికెటర్లు ఎవరు అనే దానిపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తెలివిగా సమాధానం చెప్పాడు. విరాట్‌ కోహ్లి ది బెస్ట్‌ అంటూనే ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ గురించి అతని రికార్డులే చెబుతున్నాయని పేర్కొన్నాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇద్దరూ గొప్పే అనే విధంగా గంగూలీ దాటవేత ధోరణి అవలంభించాడు. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. అదెలా చెప్పగలం. ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో విరాట్ కోహ్లి ది బెస్ట్. అది మనకు ఆనందం కలిగించే అంశం. ఇక స్టీవ్ స్మిత్ ఎంత గొప్పవాడో అతని రికార్డులే చెబుతున్నాయి’ అని ఓ క్యార్యక్రమానికి హాజరైన గంగూలీ తెలిపాడు.

ఐసీసీ  తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో  స్టీవ్‌ స్మిత్‌ తన నంబర్‌ వన్‌ ర్యాంకును నిలుపుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. ఇటీవల స్మిత్‌ టాప్‌ ర్యాంకుకు చేరగా, కోహ్లి రెండో ర్యాంకుకు పడిపోయాడు. యాషెస్‌ సిరీస్‌లో అద్భుతమైన ప‍్రదర్శనతో స్మిత్‌ అగ్రస్థానానికి ఎగబాకాడు.  ఇదిలా ఉంచితే, ఎంఎస్‌ ధోని క్రికెట్‌ భవిష్యత్తు గురించి అడగ్గా, అది కెప్టెన్‌ కోహ్లి, సెలక్టర్లే నిర్ణయించాలని గంగూలీ అన్నాడు.  ఒకవైపు ధోని భవిష్యత్తు ప్రణాళికను అతనే ఆలోచించుకోవాలని కోహ్లి, సెలక్టర్లు అంటుంటే, గంగూలీ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడాడు. ధోని కెరీర్‌పై కోహ్లి, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో  తనకు తెలీదన్నాడు.  ఇక టీమిండియా కోచ్‌గా చేసే ఆలోచన ఉందా.. అది ఎప్పుడు చెపట్టే అవకాశం ఉందనుకోవచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా ముందు ప్రస్తుతం ఉన్న కోచ్‌ పదవి ముగియనివ్వండి.. తర్వాత తన సంగతి చూద్దాం అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు