వరల్డ్‌కప్‌లో అరుదైన ఘట్టం!

7 Jul, 2019 17:13 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌ లీగ్‌ దశ ముగిసి నాకౌట్‌లో అడుగు పెట్టింది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. శ్రీలంకపై విజయంతో భారత్‌ టాప్‌కు చేరగా, దక్షిణాఫ్రికాపై ఓటమితో ఆసీస్‌ రెండో స్థానానికే పరిమితమైంది. దాంతో తొలి స్థానంలో ఉన్న భారత్‌.. నాల్గో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తొలి సెమీ ఫైనల్‌ ఆడటానికి రంగం సిద్ధమైంది. మరొక సెమీస్‌లో ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఇదిలా ఉంచితే, తాజా వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సెమీ ఫైనల్లో తలపడనున్న తరుణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందుకు కారణం 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌. ఆ వరల్డ్‌కప్‌ను విరాట్‌ కోహ్లి నేతృత‍్వంలోని భారత్‌ జట్టు గెలుచుకోవడం ఒకటైతే, ఆ అండర్‌-19 వరల్డ్‌కప్‌ తొలి సెమీ ఫైనల్లో భారత్‌-కివీస్‌ జట్లే తలపడ్డాయి.  ఆ మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.

అప్పుడు కివీస్‌కు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా ఉండగా, ఇప్పుడు కూడా బ్లాక్‌ క్యాప్స్‌కు అతనే సారథిగా వ్యవహరించడం విశేషం. అదే సమయంలో భారత్‌కు అప్పుడు-ఇప్పుడు కోహ్లినే కెప్టెన్‌ కావడం అరుదైన ఘట్టంగా చెప్పవచ్చు. అప్పటి అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 43 పరుగులు చేసిన కోహ్లి, బౌలింగ్‌లో సైతం ఆకట్టుకుని రెండు వికెట్లు సాధించాడు. అందులో కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ కూడా ఉండటం మరొక విశేషం. ఆనాటి వరల్డ్‌కప్‌లో ఆడిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌతీలు ఉండగా, తాజా వరల్డ్‌కప్‌లో కూడా ఆ ముగ్గురూ తమ తమ జాతీయ జట్లకు ప్రాతినిథ్య వహిస్తున్నారు. ఆ వరల్డ్‌కప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో భారత్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు