కోహ్లి తిరుగులేని రికార్డు!

15 Aug, 2019 10:53 IST|Sakshi

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తేడాతో కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా అదే జోరును వన్డేల్లోను కూడా కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.  తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు మూడో వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు వన్డేల్లోనూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీలతో దుమ్మురేపి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే శతకాల రికార్డుకు మరింత చేరువగా వచ్చాడు. సచిన్‌ వన్డేల్లో 49 సెంచరీలు సాధించగా, ఆ మార్కును చేరడానికి కోహ్లికి ఆరు సెంచరీల దూరంలో నిలిచాడు.

ఇదిలాఉంచితే, విరాట్‌ కోహ్లి ఒక తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ దశాబ్ద కాలంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.  ఇప్పటివరకూ ఈ రికార్డు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ పేరిట ఉండగా, దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు.   ఓ దశాబ్ద కాలంలో పాంటింగ్‌ 200 మ్యాచ్‌లు ఆడి 18,962 పరుగులు సాధించగా,  ఆ రికార్డును కోహ్లి సవరించాడు. మరొకవైపు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు.  వన్డే కెప్టెన్‌గా కోహ్లి 21 శతకాలు చేయగా, ముందు వరుసలో పాంటింగ్‌ ఉన్నాడు. పాంటింగ్‌ 22 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అదే సమయంలో విండీస్‌ పర్యటనలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ఘనత సాధించాడు. ఓవరాల్‌ విండీస్‌ పర్యటనలో కోహ్లికి ఇది నాల్గో వన్డే సెంచరీ కాగా,  మాథ్య హేడెన్‌ మూడు శతకాలు చేశాడు.

మూడో వన్డేలో విండీస్‌ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.  అయితే ఆపై వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్‌ 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 114 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు