భారీ రికార్డుపై కోహ్లి గురి

1 Oct, 2019 16:20 IST|Sakshi

విశాఖ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు.  ఇప్పటికే పలు సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను తన పేరిట లిఖించుకున్న కోహ్లి.. మరో భారీ రికార్డుపై గురి పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 21వేల పరుగుల మార్కును వేగవంతంగా చేరేందుకు కోహ్లి స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండగా, దాన్ని బ్రేక్‌ చేసే అవకాశం ఇప్పుడు కోహ్లికి వచ్చింది. సచిన్‌ టెండూల్కర్‌ 21వేల అంతర్జాతీయ పరుగుల్ని 473 ఇన్నింగ్స్‌ల్లో సాధించి ఆ ఫీట్‌ను వేగవంతంగా నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా, కోహ్లి దీన్ని అధిగమించడానికి ఎంతో ముందంజలో ఉన్నాడు. ఇప్పటివరకూ కోహ్లి ఆడిన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు 432 కాగా, సాధించిన పరుగులు 20, 719. దాంతో 21 వేల పరుగుల మార్కును చేరడానికి కోహ్లికి 281 పరుగులు అవసరం.

ఇంకా 41 ఇన్నింగ్స్‌ల్లో  దీన్ని చేరినా ఆ రికార్డు కోహ్లి పేరిట లిఖించబడుతుంది. ఈ జాబితాలో సచిన్‌ తర్వాత స్థానంలో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా( 485 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.  అయితే దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి రాణిస్తే, ఇక్కడే  ఆ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి కనీసం ఇన్నింగ్స్‌కు 50 పరుగులు చేసినా 21వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన రికార్డును నమోదు చేస్తాడు. దక్షిణాఫ్రికాపై కోహ్లి తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 758 పరుగులు సాధించాడు. 47. 37 సగటుతో రెండు శతకాలు, మూడు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.

>
మరిన్ని వార్తలు