కోహ్లి ‘ప్రమాదకర వ్యక్తి’

4 Feb, 2017 00:10 IST|Sakshi
కోహ్లి ‘ప్రమాదకర వ్యక్తి’

అతనిపై స్లెడ్జింగ్‌ పనికిరాదు ∙ఆసీస్‌ జట్టుకు మైక్‌ హస్సీ హెచ్చరిక  

మెల్‌బోర్న్‌: టెస్టు సిరీస్‌ కోసం భారత గడ్డపై అడుగు పెట్టక ముందే ఆస్ట్రేలియా జట్టుకు అన్ని వైపుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. స్పిన్‌ బౌలింగ్‌లో ఆడటం నేర్చుకోవాలంటూ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సలహా ఇవ్వగా... ఇప్పుడు ఆసీస్‌ మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ కూడా ఇక్కడ ఎలా వ్యవహరించాలో సూచనలు చేశాడు. ముఖ్యంగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అతను చెప్పాడు. కోహ్లిని అత్యంత ప్రమాదకర వ్యక్తిగా హస్సీ అభివర్ణించాడు. ‘ఆస్ట్రేలియా కోణంలో చూస్తే కోహ్లి నుంచే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అతడిని ఆరంభంలోనే అవుట్‌ చేయాలి. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. అదే జరిగితే అతని ఆట మరింత పదునెక్కుతుంది. పోరాట స్వభావం ఉన్న కోహ్లి మైదానంలో సవాళ్లను ఇష్టపడతాడు’ అని హస్సీ వ్యాఖ్యానించాడు.

కోహ్లిలాంటి ఆటగాడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ఆడాలే తప్ప దూషణకు దిగి ఆపలేరని, ఈ తరహా ప్రవర్తనతో ఆసీస్‌ కూడా ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంటుందని అతను హెచ్చరించాడు. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన జట్టే గెలుస్తుంది తప్ప మాటల యుద్ధంతో కాదని హస్సీ విశ్లేషించాడు. కెప్టెన్‌ స్మిత్, వార్నర్‌ రాణించడంపైనే ఆస్ట్రేలియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్న హస్సీ... వారు విఫలమైతే మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిపోతుందని అన్నాడు. 

>
మరిన్ని వార్తలు