కోహ్లికి అభిమాని అరుదైన కానుక

1 Nov, 2018 14:52 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రన్‌ మెషీన్‌’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లి ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని ఆదర్శంగా తీసుకున్న అతడి అభిమాని వరల్డ్‌ రికార్డు కోసం ట్రై చేస్తున్నాడు. అందుకు కోహ్లి రూపాన్నేఎంచుకున్నాడు. అర్థం కాలేదు కదా.! ఏం లేదండీ దీపావళితో పాటు కోహ్లి బర్త్‌డే (నవంబరు 5) కూడా సమీపిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందుకే కోహ్లి కోసం ప్రత్యేకంగా మొజాయిక్‌ ల్యాంప్‌ ఆర్ట్‌ను రూపొందించాడు అతడి అభిమాని.

ముంబైకి చెందిన మొజాయిక్‌ ఆర్ట్‌ నిపుణుడు అబాసాహెబ్‌ షెవాలే కోహ్లికి వీరాభిమాని. దీపావళి సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌కు ఓ వినూత్న కానుక ఇవ్వడంతో పాటు గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన కళా నైపుణ్యాన్ని ఉపయోగించి.. 4,482 మట్టి దివ్వెలతో కోహ్లి రూపాన్ని తయారు చేశాడు. 9.5 అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ ల్యాంప్‌ ఆర్ట్‌ను నవీ ముంబైలోని సీవుడ్‌ గ్రాండ్‌ సెంట్రల్‌ మాల్‌లో ప్రదర్శనకు ఉంచాడు. ఈ ఆర్ట్‌ కోసం ఎరుపు, తెలుపు, నీలం, పసుపు, పచ్చ రంగులను ఎంచుకున్నట్లు తెలిపాడు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మొజాయిక్‌ ల్యాంప్‌ ఆర్ట్‌ అని పేర్కొన్నాడు. ఈ అరుదైన కానుకను కోహ్లికి అందించేందుకు షెవాలేతో పాటు అతడి ఐదుగురు స్నేహితులు సుమారు ఎనిమిది గంటలపాటు శ్రమించారట.

మరిన్ని వార్తలు