‘అదే ఉంటే కోహ్లిని మించిపోతారు’

23 Jan, 2020 16:43 IST|Sakshi

అతను చాలా లక్కీ: రజాక్‌

లాహోర్‌: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి విరాట్‌ కోహ్లికి విశేషమైన మద్దతు ఉండటం నిజంగా అతని అదృష్టమని పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ పేర్కొన్నాడు. కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని, కాకపోతే బీసీసీఐ నుంచి సైతం పూర్తి సహకారం ఉండటం గర్వించదగినదన్నాడు. ఒక క్రికెట్‌ బోర్డు నుంచి కెప్టెన్‌కు అంతలా సహకారం అందించే విషయంలో కోహ్లి కచ్చితంగా లక్కీనేనని తెలిపాడు.

‘ కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కోహ్లి ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోవడానికి బీసీసీఐ ఇచ్చే మద్దతు కూడా అమోఘం. ఆ తరహాలో ఎవరికి సహకారం ఉన్నా వారు సక్సెస్‌ బాటలోనే పయనిస్తారు. కోహ్లికి విశేషమైన సహకారం ఉండటంతోనే అద్భుతమైన ఆటను ఆస్వాదిస్తున్నాడు. దాంతోపాటు అదే తరహా ఫలితాలు కూడా చూస్తున్నాం. ఇక మా ఆటగాళ్లకి, మా కెప్టెన్లకు పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి వచ్చే సహకారం చాలా తక్కువ. బీసీసీఐ తరహా సహకారం ఉంటే పాకిస్తాన్‌ క్రికెటర్లు కోహ్లిని మించిపోతారు. మా పీసీబీ సిస్టమ్‌లో ఆటగాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాకిస్తాన్‌లో చాలా టాలెంట్‌ ఉంది. మా క్రికెటర్లకు పీసీబీ పూర్తి మద్దతు ఇస్తే కోహ్లి కంటే అత్యుత్తమ ఆటను బయటకు తీస్తారు’ అని రజాక్‌ అభిప్రాయపడ్డాడు. (ఇక్కడ చదవండి: కోహ్లి.. అంత ఈజీ కాదు!)

భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. కోహ్లి అసాధారణ ఆటగాడని, అన్ని ఫార్మాట్‌లలో అతడు సాధించిన రికార్డులు అమోఘమని కొనియాడాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకొచ్చాడని అన్నారు. పరుగుల దాహంతో ఉన్న కోహ్లి భవిష్యత్తులో మరిన్ని రికార్డులను కొల్లగొడతాడని అన్నాడు. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లు ఏమీ తక్కువ కాదంటూ రజాక్‌ వెనకేసుకొచ్చాడు. కాకపోతే కోహ్లికి ఇచ్చే మద్దతు తమ ఆటగాళ్లకు ఇవ్వకపోవడంతోనే వెనుకబడిపోయారన్నాడు. (ఇక్కడ చదవండి: కోహ్లిని ఊరిస్తున్న టీ20 రికార్డులు)

మరిన్ని వార్తలు