భారత్‌ 264/5

31 Aug, 2019 04:59 IST|Sakshi

అర్ధసెంచరీలు సాధించిన కోహ్లి, మయాంక్‌

మరోసారి నిరుత్సాహపరిచిన పుజారా

వెస్టిండీస్‌తో రెండో టెస్టు

రాణించిన హోల్డర్‌

కింగ్‌స్టన్‌ (జమైకా):  వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత బ్యాటింగ్‌ నిలకడగా సాగుతోంది. ఇక్కడ సబీనా పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లి(163 బంతుల్లో 76; 10 ఫోర్లు), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (127 బంతుల్లో 55; 7 ఫోర్లు)లు అర్థసెంచరీలతో రాణించారు. అయితే అర్ద సెంచరీలను భారీ స్కోర్లుగా మలచడంలో విపలమయ్యారు. ఇక మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌(13), పుజారా(6), తొలి మ్యాచ్‌లో సెంచరీ హీరో అజింక్య రహానే(24)లు పూర్తిగా నిరుత్సాహపరిచారు. ప్రస్తుతం హనుమ విహారీ(42 బ్యాటింగ్‌)తో పాటు రిషభ్‌ పంత్‌(27 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. గత మ్యాచ్‌లాగే టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ మళ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో నెగ్గిన జట్టునే కొనసాగించింది. దాంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు. పరిమిత ఓవర్ల జట్టులో లేని అశ్విన్‌...రెండు టెస్టుల కోసమే విండీస్‌కు వచ్చాడు. ఇప్పుడు అతను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే స్వదేశం తిరిగి రానున్నాడు.  

ఆకట్టుకున్న కార్న్‌వాల్‌...
వెస్టిండీస్‌ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. గాయపడిన వికెట్‌ కీపర్‌ షై హోప్‌ స్థానంలో జహ్‌మర్‌ హామిల్టన్‌ జట్టులోకి రాగా... తన ఆకారంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రకీమ్‌ కార్న్‌వాల్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆరున్నర అడుగులు, 140 కిలోల బరువున్న కార్న్‌వాల్‌ తొలి మ్యాచ్‌లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు.  హోల్డర్‌ తన తొలి ఓవర్లోనే రాహుల్‌ను ఔట్‌ చేసి విండీస్‌కు బ్రేక్‌ అందించాడు.

మొదటి స్లిప్‌లో కార్న్‌వాల్‌ చక్కటి క్యాచ్‌ అందుకోవడంతో భారత ఓపెనర్‌ ఆట ముగిసింది. ఆ తర్వాత కార్న్‌వాల్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని స్పిన్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన పుజారా బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో భారీకాయుడికి తొలి వికెట్‌ దక్కింది. ఈ దశలో మయాంక్, కోహ్లి కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే హోల్డర్‌ వేసిన మరో చక్కటి బంతిని మయాంక్‌ స్లిప్‌లో ఉన్న కార్న్‌వాల్‌ చేతుల్లోకి పంపి పెవిలియన్‌ చేరాడు. తొలి మ్యాచ్‌లో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వైస్‌ కెప్టెన్‌ రహానే ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

అనంతరం అర్ధసెంచరీతో ఊపుమీదున్న కోహ్లిని ఓ చక్కటి బంతితో హోల్డర్‌ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 202 పరుగులకే భారత్‌ ప్రధాన ఐదు వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు హనుమ విహారీ జట్టు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రాణింపుపైనే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ ఆధారపడి ఉంది. 

వివియన్‌ రిచర్డ్స్‌కు అస్వస్థత
క్రికెట్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ శుక్రవారం అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కింగ్‌స్టన్‌లో రెండో టెస్టుకు ముందు వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బ తింది. వెంటనే స్ట్రెచర్‌పై ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రమైన వేడి వాతావరణం కారణంగా డీహైడ్రేషన్‌కు గురైనట్లు సమాచారం. చికిత్స అనంతరం రిచర్డ్స్‌ కోలుకొని తిరిగి కామెంటరీ చేసేందుకు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తలు