టుస్సాడ్స్‌లో కోహ్లి...

29 Mar, 2018 04:41 IST|Sakshi

న్యూఢిల్లీ: తన ఆటతో దేశ విదేశాల్లో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. దేశ రాజధానిలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మ ప్రతిష్టించనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ విగ్రహాలు ఉన్నాయి.

తాజా నిర్ణయంతో విరాట్‌ దిగ్గజాల సరసన నిలవనున్నాడు. దీనిపై విరాట్‌ స్పందిస్తూ... ‘ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేడమ్‌ టుస్సాడ్స్‌ బృందానికి కృతజ్ఞతలు. ఇది నాకు జీవితాంతం మరువలేని జ్ఞాపకం’ అని అన్నాడు. విరాట్‌ కోహ్లి ఇప్పటికే ఐసీసీ నుంచి ‘వరల్డ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, బీసీసీఐ నుంచి ‘ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు