కోహ్లి మరో ఘనత

13 Oct, 2019 15:47 IST|Sakshi

పుణె:  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సాధించాడు. తన కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుస రెండు టెస్టుల్లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఘన విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో టెస్టు కెప్టెన్‌గా కోహ్లి 30వ విజయాన్ని నమోదు చేశాడు. అయితే కోహ్లికిది కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్‌. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆసీస్‌ దిగ్గజాలు స్టీవ్‌ వా(37), రికీ పాంటింగ్‌(35)లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌(27) నాల్గో స్థానంలో ఉన్నాడు.

కాగా, మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు సాధించిన ఏకైక భారత కెప్టెన్‌ కోహ్లినే కావడం విశేషం. ఇక భారత్‌ తరఫున కోహ్లి కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు సారథిగా చేసిన ఎంఎస్‌ ధోని 27 విజయాల్ని సాధించాడు. ధోని ఓవరాల్‌గా 60 టెస్టులకు కెప్టెన్‌గా చేశాడు. కాగా, భారత్‌ నుంచి యాభై, అంతకంటే ఎక్కువ టెస్టులకు కెప్టెన్లగా చేసింది కోహ్లి, ధోనిలే కావడం మరో విశేషం. వీరిద్దరి తర్వాత భారత్‌ తరఫున ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు సౌరవ్‌ గంగూలీ సారథిగా వ్యవహరించాడు. గంగూలీ కెప్టెన్‌గా చేసిన టెస్టుల సంఖ్య 49.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.  దక్షిణాఫ్రికాను 67.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూల్చి ఇన్నింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. షమీ, ఇషాంత్‌లకు చెరో వికెట్‌ దక్కింది. 

మరిన్ని వార్తలు