అన్నింటా  అంతటా అతడే

23 Jan, 2019 00:45 IST|Sakshi

ఐసీసీ అవార్డుల్లో కోహ్లి ట్రిపుల్‌ ధమాకా

వరుసగా రెండో ఏడాది క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌

వన్డే, టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ కూడా

ఒకే ఏడాది మూడు అవార్డులు పొందిన 

తొలి క్రికెటర్‌గా రికార్డు  ఎమర్జింగ్‌ క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌

క్రికెట్‌ ప్రపంచంలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత స్టార్‌ విరాట్‌ కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా సముచిత రీతిలో గౌరవించుకుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు సాధిస్తున్న విరాట్‌ను మూడు ప్రధాన అవార్డులకు ఎంపిక చేసి అవార్డుల విలువను పెంచింది. టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించడంతో రెండు ఫార్మాట్‌లలోనూ ఉత్తమ క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి సహజంగానే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మరో సందేహం లేకుండా టెస్టు, వన్డే జట్లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  

దుబాయ్‌: 13 టెస్టుల్లో 55.08 సగటుతో 5 సెంచరీలు సహా 1322 పరుగులు... 14 వన్డేల్లో ఏకంగా 133.55 సగటుతో 6 సెంచరీలు సహా 1202 పరుగులు... వీటికి అదనంగా 10 అంతర్జాతీయ టి20ల్లో కలిపి 211 పరుగులు... ఈ అద్భుత గణాంకాలు 2018ని కోహ్లినామ సంవత్సరంగా మార్చేశాయి. అతడిని ప్రతిష్టాత్మక అవార్డులకు అర్హుడిగా చేశాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన 2018 వార్షిక పురస్కారాల్లో విరాట్‌ కోహ్లి మూడు ప్రధాన అవార్డులకు ఎంపికయ్యాడు. అన్ని ఫార్మాట్‌లలో చెలరేగినందుకు ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ) వరుసగా రెండో ఏడాది కోహ్లిని వరించింది. 2017లో కూడా అతను ఇదే అవార్డు సాధించాడు. ఇప్పుడు టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులనూ కోహ్లినే గెలుచుకున్నాడు. ఐసీసీ చరిత్రలో ఒకే ఏడాది మూడు ప్రధాన అవార్డులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలవడం విశేషం. గత ఏడాది భారత జట్టు ఉపఖండం బయటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటాన్ని బట్టి చూస్తే కోహ్లి సాధించిన ఘనత అసమానం. రెండు ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లలో కూడా కోహ్లి నంబర్‌వన్‌గా 2018ని ముగించాడు. మాజీ క్రికెటర్లు, సీనియర్‌ జర్నలిస్ట్‌లు, విశ్లేషకులతో కూడిన 36 మంది సభ్యుల ఎంపిక ప్యానెల్‌ ఏకగ్రీవంగా కోహ్లికి ఓటు వేసింది.  ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్‌ ద ఇయర్, వన్డే టీమ్‌ ద ఇయర్‌లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్‌ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.  

పంత్‌ సూపర్‌... 
టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ‘ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు. ఇందులో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో చేసిన సెంచరీ సైతం ఉంది. అతను 40 క్యాచ్‌లు అందుకోవడం అవార్డు ఎంపికకు కారణమైంది. ఇదే ప్రదర్శనతో ఐసీసీ టెస్టు జట్టు కీపర్‌గానూ పంత్‌ ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రాకు స్థానం లభించింది. వన్డే జట్టులో రోహిత్‌ శర్మ, బుమ్రా, కుల్దీప్‌లకు అవకాశం దక్కింది.  

ఫించ్‌ ఫటాఫట్‌... 
హరారేలో జింబాబ్వేపై ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్‌ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్‌ ఆటగాడు కాలమ్‌ మెక్లాయిడ్‌ ‘అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్‌పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.   ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ను విలియమ్సన్‌ (న్యూజి లాండ్‌) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్‌–19 వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది. 

►1 ఐసీసీ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని రెండోసారి నెగ్గిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతేడాది కూడా కోహ్లికి ఈ అవార్డు లభించింది. గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ (2004), సచిన్‌ (2010), అశ్విన్‌ (2016) ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు. 

►1 ఐసీసీ ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికైన తొలి భారత క్రికెటర్‌ కోహ్లినే. ధోనికి (2008, 2009) రెండుసార్లు ఈ అవార్డు వచ్చింది. 

►5 ఐసీసీ ‘టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు పొందిన ఐదో భారత క్రికెటర్‌ కోహ్లి. గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ (2004), గంభీర్‌ (2009), సెహ్వాగ్‌ (2010), అశ్విన్‌ (2016) ఈ ఘనత సాధించారు.


చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సంవత్సరం మొత్తం చేసిన కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు ఇది. వ్యక్తిగతంగా చాలా గొప్పగా అనిపిస్తుండటమే కాదు... నేను బాగా ఆడుతున్న సమయంలోనే జట్టు కూడా మంచి ఫలితాలు సాధించడం పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందరో ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై ఆడుతున్నప్పుడు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం అంటే ఒక క్రికెటర్‌గా ఇది నేను గర్వపడే క్షణం. ఈ రకమైన ప్రోత్సాహం ఇదే ఘనతను పునరావృతం చేసేందుకు కావాల్సిన స్ఫూర్తినందిస్తుంది. క్రికెట్‌ ప్రమాణాలను నిలబెట్టేందుకు, మరింత నిలకడగా రాణించేందుకు ఇలాంటివి అవసరం. 
– కోహ్లి, భారత కెప్టెన్‌   

మరిన్ని వార్తలు