ఘనంగా ఆరంభోత్సవం...

30 May, 2019 04:36 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌ కప్‌కు ఐదోసారి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్‌ బుధవారం ప్రారంభ వేడుకల్లోనూ తమ ముద్ర చూపించింది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నేపథ్యంగా ‘ది మాల్‌’ రోడ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు ఉత్సాహంగా తరలి వచ్చారు. కలిస్, పీటర్సన్‌ తదితర మాజీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ‘60 సెకన్‌ చాలెంజ్‌’ అంటూ ప్రతీ దేశం నుంచి ఇద్దరు ప్రముఖులతో డబుల్‌ వికెట్‌ క్రికెట్‌ ఆడించారు. భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే, బాలీవుడ్‌ దర్శక నటుడు ఫర్హాన్‌ అఖ్తర్‌ ఇందులో పాల్గొన్నారు. అందరికంటే తక్కువ పరుగులు (19) చేసి భారత్‌ చివరి స్థానంలో నిలవగా... ఇంగ్లండ్‌ అత్యధికంగా 74 పరుగులు సాధించింది.

పాక్‌ తరఫున ఆడిన జట్టులో నోబెల్‌ బహుమతి విజేత మలాలా పాల్గొనడం విశేషం.అనంతరం బాణాసంచా మెరుపుల మధ్య 2015 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ట్రోఫీని తీసుకొని వచ్చి వేదికపై ఉంచాడు. అంతకుముందు మధ్యాహ్నం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ను పది జట్ల కెప్టెన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ క్వీన్‌ ‘బెస్ట్‌ విషెస్‌’ చెప్పారు. ప్రిన్స్‌ హ్యారీ కూడా ఇందులో పాల్గొన్నాడు. మరోవైపు మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నిర్వాహకులు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైనపు బొమ్మను లార్డ్స్‌ మైదానంలో ఆవిష్కరించారు. టోర్నీ సాగినన్ని రోజులు ఈ విగ్రహం టుస్సాడ్‌ మ్యూజియంలో ఉంటుంది.   

మరిన్ని వార్తలు