కోహ్లి ఇబ్బంది పడటం వల్లే..

25 Jun, 2018 11:14 IST|Sakshi

కోల్‌కతా: నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి పరుగులు చేయడంలో  ఇబ్బంది పడిన కారణంగానే కౌంటీల్లో ఆడేందుకు మొగ్గుచూపాడని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కాగా, కౌంటీల్లో కోహ్లి ఆడకపోయినా పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదన్నాడు. కౌంటీలకు కోహ్లి దూరం కావడం వల్ల తగినంత విశ్రాంతి లభించిదన్నాడు. ఈసారి ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి తప్పకుండా రాణిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

గత ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి 10 ఇన్నింగ్స్‌ల్లో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేశాడు. దాన్ని ఈసారి అధిగమించేందుకు ముందుగా కౌంటీల్లో ఆడాలని కోహ్లి నిర్ణయించుకున్నాడు. అది సాధ్యపడలేదు. ఇది నాకు సంతోషం కల్గించే విషయమే. ఎందుకంటే కోహ్లికి తగినంత విశ్రాంతి లభించింది. తాజా పర్యటనలో కోహ్లి రాణించడం ఖాయం. ఇంగ్లండ్‌ను ఓడించే సత్తా భారత్‌కు ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్‌ కూడా బలంగానే ఉందనే విషయాన్ని గ్రహించాలి. దాంతో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందనే అనుకుంటున్నా. రెండు కొత్త బంతుల నేపథ్యంలో వన్డేల్లో రివర్స్‌ స్వింగ్‌ ప్రభావం తగ్గిపోతుంది. మైదానాలు పచ్చదనంతో ఉండుటుండటంతో రివర్స్‌ స్వింగ్‌ సాధ్యమవ్వట్లేదు. రివర్స్‌ స్వింగ్‌కు కావాల్సినంత పొడిగా, గరుకుగా బంతి మారడం లేదు. 50 ఓవర్లలో 500 పరుగులు ఊహించని పరిణామం. బౌలర్ల పంథా మారాలి. అత్యుత్తమ బౌలర్లు ఎందుకు ఆడటం లేదో అర్థం కావట్లేదు. అక్రమ్‌, వకార్‌ లాంటి బౌలర్లు వన్డేలు, టెస్టులు ఆడారు. మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ, పొలాక్‌, డొనాల్డ్‌ కూడా అదే పని చేశారు. టెస్టులకు, వన్డేలకు భిన్నమైన బౌలర్లు ఉండాలన్న పద్ధతి నాకు అర్థం కావట్లేదు’ అని గంగూలీ తెలిపాడు.

మరిన్ని వార్తలు