మెరిసిన కోహ్లి, రహానే

15 Dec, 2018 15:35 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. విరాట్‌ కోహ్లి, అజింక్యా రహానేలు హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి(82 బ్యాటింగ్‌; 181 బంతుల్లో 9ఫోర్లు), అజింక్యా రహానే(51 బ్యాటింగ్‌; 103 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక‍్సర్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.  ఆట నిలిచే సమయానికి వీరిద్దరూ 90 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ కుదురుకుంది

ఈ రోజు ఆటలో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డుపై 10 పరుగులు కూడా లేకుండానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మురళీ విజయ్‌ డకౌట్‌గా నిష్క్రమించగా, కేఎల్‌ రాహుల్‌(2) సైతం నిరాశపరిచాడు. ఆ సమయంలో చతేశ్వర పుజారాతో జత కలిసిన విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 74 పరుగులు జత చేసిన తర్వాత పుజారా(24; 103 బంతుల్లో 1 ఫోర్‌) పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో  కోహ్లి-అజింక్యా రహానేలు బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ చేయగా, ఆపై రహానే కూడా అర్థ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో స్టార్క్‌కు రెండు, హజల్‌వుడ్‌కు వికెట్‌ దక‍్కింది.

అంతకుముందు అంతకుముందు ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. 277/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆటను ప్రారంభించిన ఆసీస్‌..మరో 49 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది.  భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ నాలుగు వికెట్లు సాధించగా, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, విహారిలు తలో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు