గంభీర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కోహ్లి

23 Mar, 2019 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ టైటిల్‌ గెలుపు విషయంలో తనను విమర్శిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలపై విరాట్‌ కోహ్లి స్పందించాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్‌ గురించి ఏమాత్రం అవగాహన లేని వారిలా మాట్లాడుతుంటారు అంటూ గంభీర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆర్సీబీ యాజమాన్యం... కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇందుకు బదులుగా.... ‘ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నా. అయితే కేవలం ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్‌ చేయడం ఏమాత్రం సరైంది కాదు. నిజానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎటువంటి ప్రమాణాలు లేవు. నాకు సాధ్యమైనంత వరకు గెలవడానికే ప్రయత్నిస్తా. నా కెరీర్‌లో ఎన్ని టైటిల్లు గెలవాలని భావిస్తానో అన్నీ గెలిచి తీరతాను. అయితే కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన ఐపీఎల్‌లో కనీసం ఐదు మ్యాచుల వరకు నేను ఆడలేనని కొంతమంది ‘బయటి వ్యక్తులు’ భావిస్తున్నారు. వాళ్లలాగే ఇంట్లో కూర్చుంటాననుకుంటున్నారేమో’ అని కోహ్లి చురకలు అంటించాడు.(చదవండి : అందుకు కోహ్లి థ్యాంక్స్‌ చెప్పాలి : గంభీర్‌)

కాగా ఇటీవల ఓ చానెల్‌ చర్చా కార్యక్రమంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీని ఐపీఎల్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలవలేనంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ధోని, రోహిత్‌శర్మ మూడుసార్లు వారి వారి జట్లను విజేతగా నిలిపారు. ఇలాంటి సమయంలో కోహ్లిని వారితో  పోల్చవద్దు. అతడికి ఎంతో భవిష్యత్తు ఉంది. గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్‌ గెలవలేకపోయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది.ఇది కోహ్లి అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి అతడు కృతజ్ఞత తెలపాలి’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు