'టాప్'లేపిన కోహ్లి

13 Jun, 2017 17:23 IST|Sakshi
'టాప్'లేపిన కోహ్లి

దుబాయ్:అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి 862 రేటింగ్ పాయింట్లలతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి 22 పాయింట్లను సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ను వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి తొలి స్థానాన్ని ఆక్రమించగా, రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(861) నిలిచాడు. ఇక డివిలియర్స్(841 పాయింట్లు) మూడో స్థానానికి దిగజారిపోయాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. మరొకవైపు జనవరి నెలలో నాలుగు రోజులు మాత్రమే టాప్ ర్యాంకును ఎంజాయ్ చేసిన కోహ్లి.. ఇప్పుడు ఎంతకాలం ఆ ర్యాంకులో కొనసాగుతాడో చూడాలి. కాగా, టాప్ -10లో మరో భారత బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నాడు.  ఇక రోహిత్ శర్మ 13వ స్థానానికి పరిమితం కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్థానం దిగజారి 14వ స్ధానానికి పడిపోయాడు.ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లకు ఎవ్వరికీ టాప్-10లో చోటు దక్కలేదు. భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు.

మరిన్ని వార్తలు