పాట వినిపిస్తే చాలు చిందేస్తా: కోహ్లి

12 Aug, 2019 18:44 IST|Sakshi

ట్రినిడాడ్‌: ‘మంచి ఊపున్న పాట వినిపిస్తే చిందెయ్యకుండా ఎవరైనా ఉండగలరా?. నేను మాత్రం అలా ఉండలేను. పాట వినిపిస్తే డ్యాన్స్‌ చేయాల్సిందే. మైదానంలో నాకు నచ్చినట్టు నేనుంటా. నిస్తేజంగా, ఏదో కోల్పోయిన వాడిలా ఉండటం నాకు నచ్చదు. బహుశా నాకు అది దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా?. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటేనే ఆటపై ఎక్కువగా దృష్టి పెట్టగలం. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అదేవిధంగా దేశం తరుపున ఆడే అవకాశం కల్పించాడు. ఇంకేం కావాలి. మైదానంలో డ్యాన్స్‌ చేస్తా, సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లతో సరదాగా ఉంటా’అంటూ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం చహల్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తొలి వన్డే సందర్భంగా మైదానంలో క్రిస్‌ గేల్‌తో కలిసి కోహ్లి డ్యాన్స్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండో వన్డేలో విండీస్‌పై 59 పరుగుల(డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం సెంచరీతో కదంతొక్కగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ అర్దసెంచరీతో మెరవడంతో టీమిండియా సునాయాస విజయం అందుకుంది. మ్యాచ్‌ అనంతరం స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ సారథి కోహ్లిని ఇంటర్వ్యూ చేశాడు. ‘వర్షం పడిన అనంతరం ఆడటం చాలెంజ్‌తో కూడుకున్నది. మ్యాచ్‌ గెలిచేందుకు వందకు వంద శాతం కృషి చేస్తాం. ఈ మ్యాచ్‌లో అందరూ కలిసి కట్టుగా ఆడారు. సెంచరీలు సాధించిన సంతోషం కంటే.. టీమిండియా విజయానికి కావాల్సిన పరుగులు సాధించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంటుంది. కొన్ని రోజులుగా లైఫ్‌స్టైల్‌, ట్రైనింగ్‌, డైట్‌ పూర్తిగా మార్చుకున్నా’అంటూ విరాట్‌ కోహ్లి తెలిపాడు. ఇక ఇరుజట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా.. రెండో వన్డేలో కోహ్లి సేన గెలిచింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ కాపాడుకోవాలని వెస్టిండీస్‌ ఆరాటపడుతోంది.  

 

మరిన్ని వార్తలు