ధోని ‘రిటైర్మెంట్‌’పై మౌనం వీడిన కోహ్లి!

14 Sep, 2019 16:12 IST|Sakshi

ధర్మశాల:  ఇటీవల ఎంఎస్‌ ధోని గురించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌  కోహ్లి చేసిన ట్వీట్‌ పెద్ద దుమారమే రేపింది. ‘ ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. అదొక స్పెషల్‌ నైట్‌. ఆ మనిషి పరుగుతో నాకు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ ఎదురైంది’ అని ధోనిని ఉద్దేశిస్తూ విరాట్‌ ఒక పోస్ట్‌ను ట్వీటర్‌లో పెట్టాడు. దీనికి ధోనితో ఉన్న ఆనాటి ఫొటోను కూడా జత చేశాడు.  అయితే ఇది పోస్ట్‌ చేసిన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. అదే సమయంలో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి సిద్ధమైన తరుణంలోనే కోహ్లి ఇలా ట్వీట్‌ చేశాడంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కాకపోతే చివరకు ధోని రిటైర్మెంట్‌ వార్తలను అతని భార్య సాక్షితో పాటు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ కూడా ఖండించారు.  ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పెద్ద వివరణే ఇచ్చుకోవాల్సి వచ్చింది.

దీనిపై కోహ్లి ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘ నా మదిలో ఏమీ లేదు. కేవలం నేను ఆనాటి జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నానంతే. అది సాధారణంగా చేసిన పని మాత్రమే. అంతే తప్ప అది ఒక వార్తగా మారుతుందని అనుకోలేదు. ఇది నాకు ఒక గుణపాఠం. నేను చేసిన ట్వీట్‌.. ధోనికి రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తగా రావడం​ బాధాకరం. ధోని రిటైర్మెంట్‌  వార్తల్లో నిజం లేదు’ అని దక్షిణాఫ్రికాతో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భాగంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన కోహ్లి పేర్కొన్నాడు.

2016 వరల్డ్‌ టీ20లో భాగంగా సూపర్‌10లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ సందర్భాన్ని మరోసారి గుర్తు చేసుకున్న కోహ్లి.. ధోనితో కలిసి పరుగులు చేయడం ఫిట్‌నెస్‌ టెస్టును తలపించిందని ట్వీట్‌ చేశాడు.  ఆసీస్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 49కి మూడు,  94 పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కోహ్లితో జత కలిసిన ధోని మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను విజయా తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో ధోని 18 పరుగులతో అజేయంగా నిలిచినా, 67 పరుగుల్ని జత చేయడంలో భాగమయ్యాడు. అదే సమయంలో కోహ్లి 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీన్ని గుర్తు చేసుకుంటూ కోహ్లి ట్వీట్‌ చేయడం భారత క్రికెట్‌ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది.

మరిన్ని వార్తలు