పాక్‌ ఫ్యాన్స్‌ మద్దతు మనకే: కోహ్లి

30 Jun, 2019 17:16 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : టీమిండియా మ్యాచ్‌ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు తెగ ఆసక్తి కనబర్చుతారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ వంటి జట్లతో కోహ్లి సేన తలపడుతోంది అంటే వారికి పండగే. సప్తసముద్రాలు దాటైనా సరే టీమిండియాకు మద్దతు తెలపడానికి మ్యాచ్‌లకు వెళ్లాలని అనుకుంటారు. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుతున్న మ్యాచ్‌లో కోహ్లి సేన గెలవాలని భారత ఫ్యాన్స్‌తో పాటు పాక్‌ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా టీమిండియాకు మద్దతు తెలపాలని పాక్‌ మాజీ ఆటగాళ్లు వారి అభిమానులకు బహిరంగంగానే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ‘నిజాయితీగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇంగ్లండ్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ ఫ్యాన్స్‌ మద్దతు మనకే ఉండబోతుంది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. దానికి కారణాలు మనకు అనవసరం. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌ మ్యాచ్‌కు వచ్చే వారిలో 75 శాతానికి పైగా అభిమానులు మద్దతు తెలపడం టీమిండియాకు ఎంతో బలం చేకూర్చుతుంది’అంటూ కోహ్లి పేర్కొన్నాడు. ఇక పాక్‌తో పాటు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లు కూడా ఇంగ్లండ్‌ ఓడాలి భారత్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు