'అత్యంత శక్తివంతమైన టీమ్‌ను చూడనున్నారు'

17 Dec, 2019 19:23 IST|Sakshi

ఈసారి జరగబోయే ఐపీఎల్‌లో అత్యంత శక్తివంతమైన టీంను చూడబోతున్నారని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్‌ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న జరగనున్న వేలంలో అన్ని రంగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను తీసుకోబోతున‍్నట్లు స్పష్టం చేశాడు.

'మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా! త్వరలో జరగబోయే ఐపీఎల్‌ వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో పాటు కోచ్‌లు మైక్‌ హస్సీ, సైమన్‌ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు.ఇప్పటివరకు మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ మావెంటే ఉంటారని నమ్ముతున్నా. కాగా మా జట్టు యాజమాన్యంతో  ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు నిర్ణయించాం. 2020లో జరగనున్న 13 ఐపీఎల్‌ సీజన్‌కు మీరు కొత్త రాయల్‌ చాలెంజర్స్‌ టీమ్‌ను చూడబోతున్నారని' కోహ్లి ట్విటర్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.  

ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను కలిగిన  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉండేది. ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్‌ సీజన్లలో మూడు సార్లు మాత్రమే మెరుగైన ప్రదర్శన నమోదు చేసింది. 2009,  2011, 2016 లో రన్నరప్‌తోనే సరిపెట్టుకోగా మిగతా తొమ్మిది సీజన్లలో నిరాశాజనకమైన ఆటతీరును కనబర్చింది. 2016 తర్వాత జరిగిన మూడు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

అయితే డిసెంబర్‌ 19న కోల్‌కతాలో జరగనున్న ఐపీఎల్‌ వేలంలో కొత్త ఆశలతో పాల్గొననున్న బెంగళూరు టీమ్‌ తలరాత ఈసారైనా మారుతుందేమో చూడాలి. కాగా ఈసారి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు 13 ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోగా, అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లున్నారు. మిగతా 12 స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక కోసం రూ. 27.90 కోట్లతో వేలంలోకి దిగనుంది. 

మరిన్ని వార్తలు