కోహ్లి రియాక్షన్‌ అదిరింది!

12 Dec, 2019 11:31 IST|Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పరుగుల మోత మోగిస్తూ రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ సిక్సర్లను మాత్రం చాలా అరుదుగా కొడుతూ ఉంటాడు. ప్రధానంగా సిక్సర్ల విషయంలో ఎక్కువ పొదుపు పాటిస్తాడు కోహ్లి.  తనకు సిక్సర్ల కొట్టే సామర్థ్యం ఉందనే విషయాన్ని తాజాగా కోహ్లి చెప్పకనే చెప్పేశాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20లో కోహ్లి చెలరేగిపోయాడు. 21 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. మొత్తంగా 29 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించాడు. అందులో నాలుగు ఫోర్లతో పాటు ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. కాగా, విండీస్‌ బౌలర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ను తన చేష్టల ద్వారా ఆట పట్టించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20లో విలియమ్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి తన సెలబ్రేషన్స్‌ కాస్త భిన్నంగా చేసుకున్నాడు కోహ్లి. అచ్చం విలియమ్స్‌ వికెట్‌ తీసిన తర్వాత ఏ విధంగా సెలబ్రేట్‌ చేసుకుంటాడో అదే తరహాలో కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీన్ని ముంబై టీ20 మ్యాచ్‌లో కూడా కోహ్లి కొనసాగించాడు. విలియమ్స్‌ వేసిన 18 ఓవర్‌ నాల్గో బంతిని కోహ్లి మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన తర్వాత కాస్త కళ్లు పెద్దవిగా చేసి సంబరాలు చేసుకున్నాడు. తొలుత విలియమ్స్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డ కోహ్లి.. ఆ తర్వాత సిక్స్‌తో సమాధానం చెప్పాడు. దాంతో తన  ఆనందాన్ని ఆపుకోలేకపోయిన కోహ్లి ఇలా సెలబ్రేట్‌ చేసుకోవడమే కాకుండా బౌలర్‌ వద్దకు వెళ్లి మరీ తన నోటికి పనిచెప్పాడు.

మరిన్ని వార్తలు