చెత్త రికార్డు: లారాను దాటేసిన కోహ్లి

18 Dec, 2018 17:23 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్‌లో చేసిన సెంచరీతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. భారత్‌ ఘోర పరాజయంతో అతడి కెప్టెన్సీ కెరీర్‌లో చెత్త రికార్డు కూడా నమోదైంది. పెర్త్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 146 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కోహ్లి 25వ సెంచరీ వృధాగా పోయింది. తాను సెంచరీ కొట్టినా జట్టు ఓడిపోవడం కోహ్లికి ఇది ఏడోసారి కావడం గమనార్హం. కెప్టెన్‌గా సెంచరీ చేసినా టీమ్‌ ఓడిపోవడం అతడికిది ఆరోసారి. ఇంతకుముందు వెస్టిండీస్‌ బ్రియన్‌ లారా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. లారా సెంచరీలు చేసిన ఐదుసార్లు విండీస్‌ ఓడిపోయింది. వీరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా ఉన్నాడు. అతడు నాలుగు పర్యాయాలు శతకాలు బాదినప్పుడు ఆసీస్‌ పరాజయం పాలైంది.

15వ ఓటమి
పెర్త్‌ టెస్ట్‌ ఓటమి టీమిండియా చెత్త రికార్డును మరింత ముందుకు తీసుకెళ్లింది. గత 15 ఏళ్లలో 200, అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి ఓడిపోవడం భారత క్రికెట్‌ జట్టుకు ఇది 15వ సారి కావడం గమనార్హం. భారత్‌ చివరిసారిగా 2003లో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో 200 పైగా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఛేజింగ్‌లో టీమిండియా ఈ ఏడాది ఆరుసార్లు ఓడిపోయింది. కేప్‌టౌన్‌(టార్గెట్‌ 208), సెంచూరియన్‌(287), బర్మింగ్‌హామ్‌(194), సౌతాంప్టన్‌ (245), ఓవల్‌ (464), పెర్త్‌ (287) టెస్టుల్లో చతికిలపడింది.

మరిన్ని వార్తలు