కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌

14 Dec, 2018 14:33 IST|Sakshi

పెర్త్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ ఏడు పరుగుల వద్ద విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్ కోంబ్ బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లి కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ను మార్కస్‌ హారిస్‌-అరోన్‌ ఫించ్‌లు ఘనంగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 112 పరుగులు చేసిన తర్వాత ఫించ్‌(50) ఔటయ్యాడు. ఆపై మరో 30 పరుగుల వ్యవధిలో ఖవాజా(5) కూడా నిష్క్రమించడంతో ఆసీస్‌ 130 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కాసేటికి హారిస్‌(70), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌లు పెవిలియన్‌ చేరారు.  పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించేది కావడంతో స్పెషలిస్ట్‌ స్పిన్నర్ లేకుండా మొత్తం నలుగురు పేస్ బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగింది.

మరిన్ని వార్తలు