కోహ్లికి ఎందుకంత తొందర?

16 Jun, 2019 20:09 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంతి కనీసం బ్యాట్‌కు తగలకుండానే కోహ్లి పెవిలియన్‌ వీడటం సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోహ్లి స్వీయ తప్పిదం కారణంగా అతని వికెట్‌ను చేజార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లి, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజ్‌లోకి వచ్చారు. ఆ క్రమంలోనే 48 ఓవర్‌ను మహ్మద్‌ ఆమిర్‌ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్‌ తీశాడు.(అదరగొట్టిన టీమిండియా: పాక్‌కు భారీ లక్ష్యం)

దాంతో స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన కోహ్లి మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక నాల్గో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆమిర్‌ బౌన్సర్‌ వేశాడు. దాన్ని కోహ్లి హుక్‌ షాట్‌ ఆడబోగా అది కాస్తా మిస్‌ అయ్యి కీపర్‌ సర్ఫరాజ్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై ఔట్‌కు సర్ఫరాజ్‌ బలంగా అప్పీల్‌ చేయకపోయినా, అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మాత్రం పెవిలియన్‌ బాట పట్టాడు. అటు తర్వాత ఇది ఔట్ కాదని టీవీ రిప్లేలో తేలడంతో కోహ్లికి తాను చేసిన పొరపాటు తెలిసొచ్చింది. కీలకమైన మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మైదానాన్ని వీడటం ఏమిటని క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఒక సాధారణ మ్యాచ్‌లోనే ప్రతీ వికెట్‌ చాలా విలువైనది. అందులోనూ వరల్డ్‌కప్‌లో, అది కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఔట్‌ కాకుండానే మైదానాన్ని వీడటం చర్చకు దారి తీసింది. అసలు కోహ్లికి అంత తొందర ఎందుకు అనేది సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న. అయితే బ్యాట్‌ హ్యాండిల్‌ బలహీనంగా ఉన్న కారణంగానే కోహ్లి ఔట్‌గా భావించాడు. కోహ్లి గ్యాలరీలో కూర్చొన్న తర్వాత బ్యాట్‌ హ్యాండిల్‌ను చెక్‌ చేసుకోవడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(77; 65 బంతుల్లో 7 ఫోర్లు) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.


 

మరిన్ని వార్తలు