కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!

11 May, 2020 12:26 IST|Sakshi
రూబెల్‌ హుస్సేన్‌-కోహ్లి(ఫైల్‌ఫొటో)

అప్పుడే మమ్మల్ని కోహ్లి తిట్టాడు

అండర్‌-19 రోజుల్ని గుర్తు చేసుకున్న రూబెల్‌

ఢాకా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దూకుడు ఎక్కువ అనే విషయం తెలిసిందే. కోహ్లి పరుగులు చేయడానికి ఎంత తపించి పోతాడో, అవసరమైతే ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌ చేయడంలో కూడా అదే తరహా ఆవేశాన్ని చూపెడతాడు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్‌ పేసర్‌ రూబెల్‌ హుస్సేన్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రూబెల్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు.  దాంతో హుస్సేన్‌ తన సెలబ్రేషన్స్‌ భిన్నంగా చేసుకుంటూ కోహ్లికి సెండాఫ్‌ సంకేతాలు చూపించాడు. ఇలా తన సెండాఫ్‌ చెప్పడానికి  వారి మధ్య కలిసి పెరుగుతూ వస్తున్న వైరమే కారణమనే విషయాన్ని రూబెల్‌ చెప్పకనే చెప్పేశాడు.2011 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా తనతో కోహ్లి వాగ్వాదానికి దిగిన విషయాన్ని రూబెల్‌ ప్రస్తావించాడు. (హార్డ్‌ హిట్టర్‌పై ఆరేళ్ల నిషేధం)

అయితే తాము పరస్పరం తారసపడినప్పుడు ఇలా మాటల  యుద్ధానికి దిగడం కొత్తమే కాదు అంటున్నాడు రూబెల్‌. అండర్‌-19 రోజుల నుంచి తమ మధ్య ఇలా స్లెడ్జింగ్‌, వాగ్వాదం జరగడం పరిపాటిగా కొనసాగుతూ వస్తుందన్నాడు. దీనిలో భాగంగా తమ అండర్‌-19 రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘ అండర్‌-19 మ్యాచ్‌ల నుంచి మేము తలపడుతూనే ఉన్నాం. కోహ్లి అప్పట్లోనే దూకుడుగా ఉండేవాడు. తరచు ఎక్కువగా మమ్మల్ని స్లెడ్జ్‌ చేస్తూ ఉండేవాడు. అది అతనికి అలవాటుగా మారింది. మమ్మల్ని స్లెడ్జ్‌ చేసే క్రమంలో తిట్ల దండకం కూడా అందుకునే వాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్‌లో అనుకుంటా. మమ్మల్ని కోహ్లి బాగా స్లెడ్జ్‌ చేశాడు. మా బ్యాట్స్‌మెన్‌పై కూడా అసభ్య పదజాలం వాడేవాడు. అలా మా మధ్య వైరం కొనసాగుతూ వస్తుంది. మేమిద్దరం నోటికి పని చెప్పామంటే కచ్చితంగా అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పాల్సింది. అంతటి తీవ్ర స్థాయిలో ఉండేది మా వాగ్వాదం’ అని రూబెల్‌ చెప్పుకొచ్చాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌ సెషన్‌లో సహచర ఆటగాళ్లు  తమీమ్‌ ఇక్బాల్‌, తస్కిన్‌ అహ్మద్‌లు కోహ్లితో వైరాన్ని గురించి అడిగిన సందర్భంలో రూబెల్‌ వాటిని షేర్‌ చేసుకున్నాడు. 2008లో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ను కోహ్లి నేతృత్వంలోని భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే.(‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’)

మరిన్ని వార్తలు