‘ఆ కసి కోహ్లిలో కనపడింది’

12 Aug, 2019 14:28 IST|Sakshi

ట్రినిడాడ్‌: టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఫీల్డ్‌లో దూకుడు ఎక్కువే. సెంచరీ సాధించిన తర్వాత అయితే కోహ్లి సెలబ్రేట్‌ చేసుకునే విధానం ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. ఇది తన బ్యాటింగ్‌ పవర్‌ అనే అర్థం వచ్చేలా కోహ్లి సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకుంటాడు. మరి 11 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లి శతకం సాధిస్తే ఆ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో కోహ్లి సెంచరీ చేసిన తర్వాత అతని హావభావాలు సెంచరీ కోసం ఎంత ఆకలిగా ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని సహచర ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్‌ కూడా పేర్కొన్నాడు.

‘సెంచరీ తర్వాత కోహ్లి ముఖ కవలికలు చూడండి. ఎప్పుడూ లేనంతగా ఉన్నాయి. ఆ కసి అంతా సెంచరీ కోసమే. అంటే అతను ఫామ్‌లో లేడని కాదు. వరల్డ్‌కప్‌లో కూడా కోహ్లి ఆకట్టకున్నాడు. కాకపోతే 70-80 పరుగుల మధ్యలో ఔటయ్యాడు. అతను ఎప్పుడో భారీ పరుగులు చేయడం కోసమే తపిస్తూ ఉంటాడు. గత కొంతకాలంగా సెంచరీలు చేయలేకపోతున్నాననే కసిలో ఉన్న కోహ్లి.. విండీస్‌ మ్యాచ్‌లో ఆ దాహం తీర్చుకున్నాడు. ఈ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం  అంత ఈజీ కాదు. అటువంటి కోహ్లి సెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని కూడా కోహ్లి నమోదు చేశాడు. దాంతో మ్యాచ్‌పై పట్టుదొరికింది’ అని భువీ పేర్కొన్నాడు. కోహ్లి 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 120 పరుగులు సాధించగా, అయ్యర్‌ 68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 71 పరుగులు చేశాడు. కోహ్లి-అయ్యర్‌ల ద్వయం నాల్గో వికెట్‌కు 125 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు