కొత్త చరిత్రపై టీమిండియా గురి

18 Oct, 2019 16:43 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో వరుస రెండు టెస్టులను గెలిచి సిరీస్‌ను గెలిచిన టీమిండియాను ఇప్పుడు సరికొత్త రికార్డు ఊరిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో  దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. కేవలం సఫారీలతో ఒక్క సిరీస్‌ను మాత్రమే టీమిండియా కోల్పోయింది. కాకపోతే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఇంకా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఇక ఓవరాల్‌గా ఇరు జట్లు ముఖాముఖి టెస్టు పోరులో దక్షిణాఫ్రికా 15 విజయాలు సాధించగా, భారత్‌ 13 విజయాలు మాత్రమే నమోదు చేసింది.

ఇటీవల పుణేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు వైజాగ్‌ టెస్టులో కూడా భారత్‌ ఘన విజయం నమోదు చేసింది. కాగా, పుణేలో విజయం తర్వాత సిరీస్‌ను సాధించిన భారత్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో స్వదేశంలో అత్యధిక వరుస టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.  ఈ క్రమంలోనే ఆసీస్‌ను వెనక్కినెట్టింది. ఆసీస్‌ 10 వరుస సిరీస్‌లు సాధించగా, దాన్ని భారత్‌ 11 వరుస సిరీస్‌ల ద్వారా బ్రేక్‌ చేసింది. కాగా, ఇప్పుడు భారత్‌ను మరో రికార్డు ఊరిస్తోంది.

రేపు(శనివారం) రాంచీలో దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే ఒక రికార్డును నెలకొల్పుతుంది. సఫారీలపై తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసే ఘనత సాధిస్తుంది. ఇప్పటివరకూ భారత్‌ జట్టు.. దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయలేదు. ఆ అవకాశం ఇప్పుడు విరాట్‌ గ్యాంగ్‌ ముందు ఉంది. రాంచీ టెస్టులో భారత్‌ గెలిస్తే సఫారీలను వైట్‌వాష్‌ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది.  భారత్‌లో చివరిసారి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం​ చేసుకుంది. అందులో మూడు టెస్టులను భారత్‌ గెలవగా, ఒక టెస్టు డ్రా అయ్యింది. దాంతో సఫారీలను క్లీన్‌స్వీప్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించాలనే యోచనలో టీమిండియా ఉంది.

మరిన్ని వార్తలు