చెన్నై విజయం.. మళ్లీ టాప్

28 Apr, 2015 23:46 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో చెన్నై 2 పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్పై పోరాడి గెలుపొందింది. 135 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా పూర్తి ఓవర్లు ఆడి 9 వికెట్లకు 132 పరుగులే చేసింది. రాబిన్ ఊతప్ప 39, టెన్ డష్కాటె 38 (నాటౌట్) పరుగులు చేశారు. ఓ దశలో లక్ష్యం దిశగా పయనించిన గంభీర్ సేన చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. చెన్నై బౌలర్లు డ్వెన్ బ్రావో 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. చెన్నై బ్యాటింగ్లో మెరుపులు లేకపోయిన బౌలింగ్లో రాణించి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంది.


టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. డుప్లెసిస్ 29, డ్వెన్ స్మిత్ 25, బ్రెండన్ మెకల్లమ్ 19, సురేష్ రైనా 17, రవీంద్ర జడేజా 15 పరుగులు చేశారు. ఆరంభంలో చెన్నై దూకుడుగా ఆడింది. 4.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఈ సమయంలో బ్రెండన్ మెకల్లమ్.. పీయూష్ చావ్లా బౌలింగ్లో అవుటవడంతో చెన్నై జోరు తగ్గింది. ఆ తర్వాత కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. జట్టు ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. కోల్కతా బౌలర్లు పీయూష్ చావ్లా, ఆండ్రీ రసెల్ చెరో 2 వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు