కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్‌

16 Aug, 2019 05:53 IST|Sakshi

కోల్‌కతా: న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ఐపీఎల్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు ఇప్పుడు హెడ్‌ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ సీజన్‌ అనంతరం చీఫ్‌కోచ్‌ జాక్వస్‌ కలిస్‌ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో        మెకల్లమ్‌కు కోచింగ్‌ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్‌ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కూడా మెకల్లమ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు.  

లీగ్‌లో మెకల్లమ్‌..
2008లో ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్‌ నుంచి 2018 వరకు కేకేఆర్‌తో పాటు, కొచ్చి టస్కర్‌ కేరళ, గుజరాత్‌ లయన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.  మొత్తం 109 మ్యాచ్‌లాడిన మెకల్లమ్‌ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు