కోల్‌కతా తడాఖా

29 Apr, 2019 01:51 IST|Sakshi

రసెల్‌ ఆల్‌రౌండ్‌ షో

ముంబైపై గెలుపుతో రేసులో కోల్‌కతా

రాణించిన గిల్, లిన్‌

హార్దిక్‌ ‘సిక్స్‌’ల పోరాటం వృథా

నైట్‌రైడర్స్‌ తరఫున నలుగురే బ్యాటింగ్‌కు దిగారు. కానీ... చేసింది 232 పరుగులు! ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరిది. ఔటైన ఇద్దరు (గిల్, లిన్‌)... ఔట్‌ కాని ఒక్కడు (రసెల్‌) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌండరీల్ని అవలీలగా బాదేశారు. 20 ఓవర్లయ్యాక చూస్తే కొండంత స్కోరు కోల్‌కతాది. హార్దిక్‌ పోరాడినా ముంబై దీనిని అందుకోలేక పోయింది. ముఖ్యంగా తనను వన్‌డౌన్‌లో దింపితే అవతలి జట్టుకు ఎంత నష్టమో రసెల్‌ నిరూపించాడు.

కోల్‌కతా: ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు కోల్‌కతా మిసైల్‌ బ్యాట్స్‌మన్‌ రసెల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకే వరుసగా ఓడుతున్నాం’ అని విమర్శించాడు. అందుకేనేమో వెంటనే కళ్లు తెరిచిన నైట్‌రైడర్స్‌ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంది. రసెల్‌ను వన్‌డౌన్‌లో దించింది. అంతే సిక్సర్ల ఉప్పెనే! గెలిచి రేసులో నిలవాల్సిన పోరులో కోల్‌కతా ‘ధనాధన్‌’లాడించింది. గెలిస్తే ముందడుగు వేసే స్థితిలో ఉన్న ముంబైని నిలువరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 34 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది.

శుబ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్‌ (40 బంతుల్లో 80 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు. దీంతో మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓడింది. హార్ధిక్‌ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) బెదరగొట్టాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. రసెల్, గర్నీ, నరైన్‌లు తలా 2 వికెట్లు తీశారు. రసెల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు.  

దిగినాడో... దంచాడే!
ముంబై టాస్‌ నెగ్గి తప్పు చేసింది. కోల్‌కతాకు బ్యాటింగ్‌ అప్పజెప్పింది. లిన్‌తో జతగా ఓపెనింగ్‌ చేసిన శుబ్‌మన్‌ గిల్‌ నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌కు బౌండరీలతో శ్రీకారం చుట్టాడు. శరణ్‌ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు బాదాడు. నాలుగో ఓవర్లో లిన్‌ రెండు బౌండరీలతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్‌ 10 పరుగులకు తగ్గలేదు. మలింగ, రాహుల్‌ చహర్, బుమ్రా ఎవరు బౌలింగ్‌ వేసినా ఫోర్లు, సిక్సర్లే! 9 ఓవర్లు ముగిసేసరికి వికెటే కోల్పోకుండా 89 పరుగులు చేసింది. లిన్‌ 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. జోరుమీదున్న ఈ జోడీకి పదో ఓవర్లో చుక్కెదురైంది. లిన్‌ను చహర్‌ ఔట్‌ చేయడంతో 96 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటే రసెల్‌ వన్‌డౌన్‌లోకి రావడంతో బౌలర్ల భరతం పట్టేందుకు తెరలేచింది.  

గిల్‌ అర్ధశతకం...
ఆద్యంతం దూకుడుగానే కనిపించిన గిల్‌ జిగేల్‌మనే ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్యాట్‌కు అందిన బంతిని బౌండరీగా, చెత్త బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో శుబ్‌మన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసెల్‌తో రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాక నిష్క్రమించాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) జత కలువగా రసెల్‌ వన్‌సైడ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 74 పరుగులు జోడించడం విశేషం.

ముంబై తడబాటు...
ఈ సీజన్‌లోనే కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది.  రెండో ఓవర్లోనే డికాక్‌ (0) డకౌట్‌ కాగా, నాలుగో ఓవర్లో రోహిత్‌ శర్మ (12) ఆట ముగిసింది. ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్‌ చేరారు. తర్వాత వచ్చిన లూయిస్‌ (15), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు ఆడగలిగినా... రసెల్‌ వీళ్లిద్దరిని ఔట్‌ చేశాడు. క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ (20; 2 ఫోర్లు) 21 బంతులాడినా మెరిపించలేకపోయాడు. రెండు బౌండరీలు కొట్టిన పొలార్డ్‌... నరైన్‌ ఉచ్చులో పడ్డాడు. తర్వాత పాండ్యా బ్రదర్స్‌ ఆటకు వేగం తెచ్చారు.

హార్దిక్‌ అదరగొట్టాడు...
హార్దిక్‌ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. చావ్లా వరుస ఓవర్లలో (10, 12వ) రెండేసి సిక్స్‌ల చొప్పున బాదాడు. నరైన్, గర్నీ ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక బౌండరీ సాయంతో వేగంగా       అర్ధసెంచరీ చేశాడు. ఎవరు బౌలింగ్‌కు           వచ్చినా బంతిని అదేపనిగా సిక్స్‌లుగా మలిచాడు. 16వ ఓవర్‌ వేసేందుకు చావ్లా రాగా సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో 4, 6తో 14 పరుగులు జతచేశాడు. చిచ్చర      పిడుగల్లే చెలరేగుతున్న హార్దిక్‌ను గర్నీ 18వ ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. చావ్లా ఆఖరి    ఓవర్లో కృనాల్‌ (24) ఔటయ్యాడు.  

అతని ఆటే ‘హైలైట్స్‌’
ఇన్నింగ్స్‌ బ్రేక్‌లోనో, మ్యాచ్‌ పూర్తయ్యాకో టీవీల్లో మనకు కనిపిస్తాయే... ఆ హైలైట్స్‌! అవి రసెల్‌ ఆటలోనే కనిపించాయి. మూడు బంతులాడినా పరుగే చేయని ఈ మిసైల్‌ తర్వాత ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చహర్‌ వేసిన 12వ ఓవర్లో బౌండరీతో మొదలైన హిట్టింగ్‌కు అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఫుల్‌టాస్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా, బౌన్సర్‌ వేస్తే అప్పర్‌ కట్‌తో థర్డ్‌మ్యాన్‌ దిశగా ఎక్కడ బంతి వేసినా... అది సిక్స్‌గానే ఫిక్సయింది.  చహర్‌ 13 ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. బంతి పదేపదే బౌండరీ లైన్‌ అవతలికే వెళ్లిపోవడంతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. హార్దిక్‌ పాండ్యా 18వ ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదితే 20 పరుగులొచ్చాయి. 19వ ఓవర్‌ బుమ్రా వేస్తే సిక్స్, ఫోర్‌ 15 పరుగులు! మలింగ ఆఖరి ఓవర్లో 6, 4, 4, 0, 0, 6 ఇరవై పరుగులు లభించాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు