కోల్‌కథ మార్చుకుంది

16 Mar, 2019 00:03 IST|Sakshi

2012 ఐపీఎల్‌ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఫైనల్‌ చేరిన తొలిసారే ట్రోఫీ సొంతం

తొలి మూడు సీజన్‌లలో టాప్‌–5లో కూడా నిలవని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాలుగో సీజన్‌లో ప్లే ఆఫ్‌ దశకు చేరుకొని ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో నిష్క్రమించింది. 2012 ఐదో సీజన్‌లో మాత్రం అందరి అంచనాలను తారుమారు చేసి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌ చేరిన తొలి ప్రయత్నంలోనే గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వంలోని నైట్‌రైడర్స్‌ జట్టు తుది పోరులో పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి సగర్వంగా ట్రోఫీని చేజిక్కించుకుంది. విజేత హోదాలో కోల్‌కతాకు వెళ్లిన ఆ జట్టుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరగడం విశేషం. ఆ టోర్నీ విశేషాలు క్లుప్తంగా... 

తొమ్మిది జట్లతో... 
2011 సీజన్‌లో తొలిసారి పది జట్లతో లీగ్‌ నిర్వహించగా 2012లో ఆ సంఖ్య తొమ్మిదికి పడిపోయింది. నిబంధనల ప్రకారం బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించనందుకు కొచ్చి టస్కర్‌ కేరళ జట్టును బీసీసీఐ లీగ్‌ నుంచి తొలగించింది. లీగ్‌ మొత్తం హోరాహోరీగా సాగింది. 76 మ్యాచ్‌ల్లో 19 మ్యాచ్‌ల ఫలితాలు ఆఖరి ఓవర్లో... ఇందులో రెండు మ్యాచ్‌ల ఫలితాలు చివరి బంతికి వచ్చాయి. మరో ఆరు మ్యాచ్‌ల ఫలితాల్లో పరుగుల వ్యత్యాసం పదిలోపే ఉంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (22 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (21 పాయింట్లు), ముంబై ఇండియన్స్‌ (20 పాయింట్లు), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (17 పాయింట్లు) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి చాంపియన్స్‌ లీగ్‌తోపాటు ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించాయి. ప్లే ఆఫ్‌ క్వాలిఫయర్‌–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18 పరుగులతో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 38 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. అనంతరం క్వాలిఫయర్‌–2లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 86 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచి ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరుకు సిద్ధమైంది. చెన్నైలో జరిగిన ఫైనల్లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. మైక్‌ హస్సీ (43 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సురేశ్‌ రైనా (38 బంతుల్లో 73; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం కోల్‌కతా జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మాన్విందర్‌ బిస్లా (48 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాక్వస్‌ కలిస్‌ (49 బంతుల్లో 69; 7 ఫోర్లు, సిక్స్‌) రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించి కోల్‌కతా విజయానికి పునాది వేశారు. 

పరుగుల ప్రవాహం... 
ఐదో సీజన్‌లో బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలర్ల హవా కూడా నడించింది. మొత్తం 22,453 పరుగులు నమోదవ్వడమే కాకుండా 857 వికెట్లు పడ్డాయి. ఇందులో పేస్‌ బౌలర్లు 537 వికెట్లు తీయగా... స్పిన్నర్లకు 241 వికెట్లు లభించాయి. లీగ్‌లో అత్యధికంగా ఆరు సెంచరీలు, రికార్డుస్థాయిలో 96 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. క్రిస్‌ గేల్, మురళీ విజయ్, డేవిడ్‌ వార్నర్, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే, కెవిన్‌  పీటర్సన్‌  ఒక్కో సెంచరీ చేశారు.  

షారుఖ్‌పై నిషేధం... 
ఈ సీజన్‌లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్తాన్‌  రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌  బహిరంగంగా ధూమపానం చేసినందుకు రాజస్తాన్‌  పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అనంతరం వాంఖడే స్టేడియం సెక్యూరిటీ గార్డ్‌తో గొడవ పడినందుకు షారుఖ్‌ ఖాన్‌పై ముంబై క్రికెట్‌ సంఘం వాంఖడే మైదానంలో ప్రవేశం లేకుండా అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్‌ చానెల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌ లో ఐదుగురు క్రికెటర్లు మోనిశ్‌ మిశ్రా, షలబ్‌ శ్రీవాస్తవ, టీపీ సుధీంద్ర, అమిత్‌ యాదవ్, అభినవ్‌ బాలి స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ వారిని సస్పెండ్‌ చేసింది.

వీరు గుర్తున్నారా..! 

ఐపీఎల్‌–5 సీజన్‌  విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో కలిస్, బ్రెండన్‌ మెకల్లమ్, మర్చంట్‌ డి లాంగె, హాడిన్‌ , బ్రెట్‌ లీ, ఇయాన్‌  మోర్గాన్‌ , సునీల్‌ నరైన్‌ , ప్యాటిన్సన్‌ , షకీబ్‌ అల్‌ హసన్‌ , ర్యాన్‌  డషెట్‌ విదేశీ ఆటగాళ్లు కాగా... గంభీర్, బాలాజీ, జైదేవ్‌ ఉనాద్కట్, షమీ, యూసుఫ్‌ పఠాన్‌ , సంజూ సామ్సన్‌ , మనోజ్‌ తివారీ భారత జట్టుకు ఆడారు. సరబ్జిత్‌ లడ్డా, రజత్‌ భాటియా, దేబబ్రత దాస్, మాన్విందర్‌ బిస్లా, చిరాగ్‌ జాని, ఇక్బాల్‌ అబ్దుల్లా, ప్రదీప్‌ సాంగ్వాన్‌ , ఐరిష్‌ సక్సేనాలకు ఇప్పటి వరకు జాతీయ సీనియర్‌  జట్టుకు ఆడే అవకాశం రాలేదు.   

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌
సునీల్‌ నరైన్‌ 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌; 24 వికెట్లు

అత్యధిక పరుగులు
(ఆరెంజ్‌ క్యాప్‌): క్రిస్‌ గేల్‌ 
బెంగళూరు; 733  

అత్యధిక వికెట్లు (పర్పుల్‌ క్యాప్‌):
మోర్నీ మోర్కెల్‌
ఢిల్లీ; 25 వికెట్లు  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు