గిల్‌ గెలిపించాడు

4 May, 2018 04:01 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌, దినేశ్‌ కార్తీక్‌

అర్ధ శతకంతో మెరిసిన శుబ్‌మన్‌

రాణించిన దినేశ్‌ కార్తీక్‌

నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ

చెన్నైపై 6 వికెట్లతో కోల్‌కతా విజయం

కోల్‌కతాకు కీలక విజయం... తొలుత చెన్నైను బ్యాటింగ్‌లో కట్టడి చేసి, తర్వాత బ్యాటింగ్‌లో స్థిరమైన ఆటతో ఛేదనను పూర్తి చేసిన ఆ జట్టు గెలుపును తన ఖాతాలో వేసుకుంది. నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ, యువ శుబ్‌మన్‌ గిల్‌ సంయమనం, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మెరుపులతో నైట్‌ రైడర్స్‌...ధోని జట్టును మట్టికరిపించింది.

కోల్‌కతా: సొంతగడ్డపై ఛేదనలో అద్భుత రికార్డున్న తమను ఓడించడం కష్టమేనని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరోసారి చాటిచెప్పింది. పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్‌తో గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా చక్కటి ఆటతీరుతో 6 వికెట్లతో గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై... కెప్టెన్‌ ధోని (25 బంతుల్లో 43 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఓపెనర్‌ వాట్సన్‌ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సురేశ్‌ రైనా (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సునీల్‌ నరైన్‌ (2/20), పీయూష్‌ చావ్లా (2/35) ప్రత్యర్థిని కట్టడి చేశారు. యువ శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 45 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 4 వికెట్లే కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదనను సునాయాసంగా పూర్తి చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నరైన్‌ (20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి ఉపయుక్త ఇన్నింగ్స్‌ ఆడాడు.

తలా ఓ చేయి...
క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్‌ తమ వంతు పరుగులు చేయడంతో చెన్నై మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఓపెనర్లలో వాట్సన్‌ తడబడినా డు ప్లెసిస్‌ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. వీరు తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రైనా వస్తూనే ఫోర్లు కొట్టి రన్‌రేట్‌ తగ్గకుండా చూశాడు. రెండో వికెట్‌కు 43 పరుగులు జతయ్యాక రైనా, వాట్సన్‌ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. మంచి ఫామ్‌లో ఉన్న రాయుడు (21)ను నరైన్‌ బోల్తా కొట్టించగా, ధోని కుదురుకోవడానికి సమయం తీసుకోవడంతో పరుగుల రాక మందగించింది. అయితే, మావి, జాన్సన్, కుల్దీప్‌ల ఓవర్లలో నాలుగు సిక్స్‌లు కొట్టిన మహి గేరు మార్చాడు. మరో ఎండ్‌లో జడేజా (12) ఎప్పటిలాగే కిందా మీదా పడుతూ ఆడాడు. నరైన్‌ 19వ ఓవర్లో నాలుగే పరుగులిచ్చినా, చావ్లా వేసిన చివరి ఓవర్లో మూడు ఫోర్లు సహా 15 పరుగులు రావడంతో సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను గౌరవప్రదమైన స్కోరుతో ముగించింది.

నైట్‌ రైడర్స్‌ సునాయాసంగా...
ఇన్‌గిడి వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా ఛేదనను ఘనంగా ప్రారంభించిన ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (12) చివరి బంతికి స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో  ఆసిఫ్‌ బౌలింగ్‌లో జడేజా రెండు సులభ క్యాచ్‌లు వదిలేసి నరైన్‌కు లైఫ్‌లిచ్చాడు. అడపాదడపా బ్యాట్‌ ఝళిపిస్తూ ఈ అవకాశాన్ని అతడు బాగానే ఉపయోగించుకున్నాడు. ఉతప్ప (6) విఫలమైనా గిల్‌... వాట్సన్‌ బౌలింగ్‌లో చక్కటి షాట్లతో మూడు ఫోర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నరైన్‌ వెనుదిరగడం, రింకూ సింగ్‌ (16) పరుగులకు ఇబ్బంది పడటంతో చెన్నై పైచేయి సాధిస్తున్నట్లు కనిపించింది. కానీ, దినేశ్‌ కార్తీక్, గిల్‌ సంయమనంతో ఆడారు. 36 బంతుల్లో 58 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆసిఫ్‌ బౌలింగ్‌లో గిల్‌ రెండు, కార్తీక్‌ ఒక సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. తర్వాతి ఓవర్లోనూ 14 పరుగులు రావడంతో లక్ష్యం మరింత కరిగిపోయింది. నిబ్బరంగా ఆడిన గిల్‌ ఈ క్రమంలో ఐపీఎల్‌లో తొలి అర్ధ శతకం (32 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రేవో వేసిన 18వ ఓవర్లో కార్తీక్‌ మూడు ఫోర్లు కొట్టి 14 బంతులు ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌:
వాట్సన్‌ (సి) శివమ్‌ మావి (బి) నరైన్‌ 36; డు ప్లెసిస్‌ (బి) చావ్లా 27; రైనా (సి) జాన్సన్‌ (బి) కుల్దీప్‌ 31; రాయుడు (బి) నరైన్‌ 21; ధోని నాటౌట్‌ 43; జడేజా (సి) కార్తీక్‌ (బి) చావ్లా 12; కరణ్‌ శర్మ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–48, 2–91, 3–101, 4–119, 5–173. బౌలింగ్‌: జాన్సన్‌ 4–0–51–0, చావ్లా 4–0–35–2, శివమ్‌ మావి 3–0–21–0, నరైన్‌ 4–0–20–2, రసెల్‌ 1–0–12–0, కుల్దీప్‌ 4–0–34–1.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌:
లిన్‌ (సి) వాట్సన్‌ (బి) ఇన్‌గిడి 12; నరైన్‌ (సి) బ్రేవో (బి) జడేజా 32; ఉతప్ప (సి) బ్రేవో (బి) ఆసిఫ్‌ 6; శుబ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 57; రింకూ సింగ్‌ (బి) హర్భజన్‌ 16; కార్తీక్‌ నాటౌట్‌ 45; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 180.

వికెట్ల పతనం: 1–12, 2–40, 3–64, 4–97.

బౌలింగ్‌: ఇన్‌గిడి 3–0–36–1, ఆసిఫ్‌ 3–0–32–1, వాట్సన్‌ 2–0–19–0, జడేజా 4–0–39–1, హర్భజన్‌ 3–0–20–1, బ్రేవో 1.4–0–22–0, కరణ్‌ శర్మ 1–0–11–0  

మరిన్ని వార్తలు