కోల్‌కతా తడాఖా

13 May, 2018 01:28 IST|Sakshi

చెలరేగిన నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌

మెరిసిన నరైన్, కార్తీక్, రసెల్‌

ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు

పంజాబ్‌పై 31 పరుగులతో గెలుపు  

బ్యాట్స్‌మెన్‌ స్ట్రయిక్‌ రేట్‌... బౌలర్ల ఎకానమీ పోటీపడ్డాయి...బౌండరీలు, సిక్సర్లతో హోల్కర్‌ మైదానం హోరెత్తింది.ఇరు జట్ల రన్‌ రేట్‌ తారాజువ్వలా దూసుకెళ్లింది...భారీ స్కోర్ల మ్యాచ్‌ అంతే స్థాయిలో అలరించింది...కోల్‌కతా తడాఖా ముందు పంజా(బ్‌) జావగారిపోయింది... 

ఇండోర్‌: బ్యాట్స్‌మెన్‌ పరుగుల పండుగ చేసుకున్న మ్యాచ్‌లో కోల్‌కతాను పంజాబ్‌ అందుకోలేక పోయింది. రెండు ఓటముల అనంతరం ఈ మ్యాచ్‌లోకి దిగిన నైట్‌రైడర్స్‌ సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసి... కింగ్స్‌ ఎలెవన్‌కు వరుసగా రెండో పరాజయం మిగిల్చింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులతో ఆ జట్టు విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా... సునీల్‌ నరైన్‌ (36 బంతుల్లో 75; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆండ్రూ టై (4/41)కు  నాలుగు వికెట్లు దక్కాయి. రాహుల్‌ (29 బంతుల్లో 66; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ (22 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్‌ (20 బంతుల్లో 34; 3 సిక్స్‌లు)ల పోరాటంతో ఛేదనలో పంజాబ్‌ కొంత దీటుగానే ఆడింది. కీలక బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఆ జట్టు 8 వికెట్లకు 214 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌తో కాంటిల్బరీ సియర్ల్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. 

బాబోయ్‌ నరైన్‌... 
తొలి ఓవర్లో్ల క్రిస్‌ లిన్‌ (27) రెండు ఫోర్లు మినహా 3 ఓవర్ల వరకు కోల్‌కతా ఇన్నింగ్స్‌ మామూలుగానే సాగింది. నాలుగో ఓవర్లో రెండు బంతులేసిన ముజీబుర్‌ రెహ్మాన్‌... నరైన్‌ రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో చేతికి దెబ్బ తగిలించుకున్నాడు. మిగతా ఓవర్‌ను పూర్తిచేసే బాధ్యత తీసుకున్న అశ్విన్‌కు  సిక్స్, ఫోర్‌తో నరైన్‌ స్వాగతం పలికాడు. అప్పటి నుంచి మొదలైంది అతడి జోరు. ఈ మధ్యలో రెండు సిక్స్‌లు కొట్టిన లిన్‌ అవుటైనా... నరైన్‌ తగ్గలేదు. 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఉతప్ప (24) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో రన్‌రేట్‌ 10కి చేరింది. శరణ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌... టై బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన నరైన్‌ వెంటనే అవుటయ్యాడు. మరో రెండు బంతుల తర్వాత ఉతప్ప వెనుదిరిగాడు. 12 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 130/3. తర్వాత కార్తీక్‌ బౌండరీలతో, రసెల్‌ సిక్స్‌లతో చెలరేగారు. 19 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. వీరి ధాటికి ముజీబుర్‌ 16వ ఓవర్లో 21 పరుగులిచ్చాడు. 16.3 ఓవర్‌కే స్కోరు 200కి చేరింది. పరిస్థితి చూస్తే మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా రసెల్‌ను అవుట్‌ చేసిన టై... 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి జట్టుకు ఉపశమనం కలిగించాడు. నితీశ్‌ రాణా (11) తోడుగా కార్తీక్‌ (22 బంతుల్లో) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. శుబ్‌మన్‌ గిల్‌ (8 బంతుల్లో 16 నాటౌట్‌; 3 ఫోర్లు) కొన్ని మంచి షాట్లు కొట్టగా... చివరి బంతికి సిక్స్‌తో సియర్ల్స్‌ ఘనంగా ముగించాడు. పంజాబ్‌ బౌలర్లందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులివ్వడం గమనార్హం.  

రాహుల్‌ మెరుపులు సరిపోలేదు... 
మొదటి ఓవర్లోనే రెండు అద్భుత సిక్స్‌లు బాది రాహుల్‌ ఛేదనను ఘనంగా ప్రారంభించాడు. అయితే క్రిస్‌ గేల్‌ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తడబడటంతో లక్ష్యానికి తగినట్లు పరుగులు రాలేదు. గేల్, మయాంక్‌ (0)లను వరుస బంతుల్లో, మరుసటి ఓవర్లో కరుణ్‌ నాయర్‌ (3)ను అవుట్‌ చేసి రసెల్‌ ఆ జట్టును దెబ్బ కొట్టాడు. అర్ధ శతకం (22 బంతుల్లో) అనంతరం తన బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన రాహుల్‌ను నరైన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ గెలుపు ఆశలు అడుగంటాయి. అక్షర్‌ పటేల్‌ (19) అవుటయ్యాక ఫించ్, అశ్విన్‌ కొంతసేపు నడిపించారు. ఫించ్‌ను సియర్ల్స్‌ వెనక్కుపంపినా అశ్విన్‌ చకచకా పరుగులు సాధించాడు. కానీ లక్ష్యం మరీ పెద్దదిగా ఉండటంతో తన జోరు సరిపోలేదు. చివరి ఓవర్లో ప్రసిద్ధ్‌ కృష్ణ... అశ్విన్, టై (14)లను పెవిలియన్‌ చేర్చాడు. కోల్‌కతా బౌలర్లలోనూ ప్రసిద్ధ్, చావ్లా మినహా మిగతావారు 10పైగా ఎకానమీతో పరుగులివ్వడం గమనార్హం.  

మరిన్ని వార్తలు