ఢిల్లీపై కోల్కతా విజయం

8 May, 2015 02:00 IST|Sakshi
ఢిల్లీపై కోల్కతా విజయం

కోల్కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్కు కోల్కతా నైట్ రైడర్స్ కు మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా 13 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి పాలైంది. తొలుత ఓపెనర్లుగా దిగిన ఢిల్లీ ఆటగాళ్లు శ్రేయాస్ ఇయర్ (40), మనోజ్ తివారీ (25) పరుగులతో పెవిలియన్ బాట పట్టారు. మిగతా ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. డుమినీ (25), జాదవ్ (10), మాథ్యూస్ (22) పరుగులు చేసి వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ మెరుస్తాడనే ఆశతో ఎదురుచూసినా అభిమానులకు, ఢిల్లీ జట్టులో నిరాశే ఎదురైంది. ఊహించని విధంగా యువరాజ్ డకౌటయ్యాడు. కాగా, తివారీ (24), మెర్కెల్ (5) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కోల్ కతా బౌలర్లు రస్సెల్, హాగ్ చెరో వికెట్ తీసుకోగా, చావ్లా మాత్రం ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ పటిమతో ఢిల్లీ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. చావ్లా... బౌలింగ్ లో ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పీయూస్ చావ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఢిల్లీకి 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా దిగిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ 12, ఉతప్ప 32 పరుగులు చేశారు. ఆ తరువాత వచ్చిన మిగతా ఆటగాళ్లు పాండే 22, పటాన్ 42, చావ్లా 22, రస్సెల్ 5, యాదవ్ 7 నాటౌట్, బోతా 17 రనౌట్.. వీరందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ బౌలర్లు జహీర్, మెర్కెల్, మిశ్రా, యువరాజ్ తలో వికెట్ తీసుకోగా, తహీర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు