కోల్‌కతాకే ఐఎస్‌ఎల్‌ కిరీటం

15 Mar, 2020 03:20 IST|Sakshi

ఫైనల్లో చెన్నైయిన్‌పై గెలుపు

మూడు సార్లు టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా ఘనత

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ చరిత్రలో అట్లెటికో డి కోల్‌కతా జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఆరో సీజన్‌ ఫైనల్లో కోల్‌కతా 3–1 గోల్స్‌ తేడాతో చెన్నైయిన్‌ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆరు సీజన్‌లు జరగ్గా... అందులో కోల్‌కతా (2014, 2016, 2019–20), చెన్నైయిన్‌ రెండు సార్లు (2015, 2017–18), బెంగళూరు ఒకసారి (2018–19) విజేతలుగా నిలిచాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో నిర్వహించిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోల్‌కతా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదల్లేదు.

కోల్‌కతా ప్లేయర్‌ జావీ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... గార్సియా (48వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. చెన్నైయిన్‌ తరఫున వాల్‌స్కీస్‌ (69వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. రెండో అర్ధభాగంలో చెన్నైయిన్‌ ప్లేయర్లు గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలను కోల్‌కతా గోల్‌ కీపర్‌ అరిందామ్‌ భట్టాచార్య సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సీజన్‌ చాంపియన్‌ కోల్‌కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్‌ చెన్నైయిన్‌ రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. 15 గోల్స్‌ సాధించిన చెన్నైయిన్‌ ఆటగాడు వాల్‌స్కీస్‌కు ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డు దక్కింది. గోల్డెన్‌ గ్లవ్‌ అవార్డును బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ సుమీత్‌ (కోల్‌కతా)... ‘హీరో ఆఫ్‌ ద లీగ్‌’గా హ్యూగో బౌమౌస్‌ (గోవా ఎఫ్‌సీ) నిలిచారు.

మరిన్ని వార్తలు