కెయిన్స్‌ చాంపియన్‌గా హంపి

17 Feb, 2020 12:37 IST|Sakshi

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): గతేడాది చివర్లో ప్రతిష్టాత్మక  ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన భారత నంబర్‌వన్‌ చెస్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి.. ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించారు. కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో హంపి విజేతగా నిలిచారు. తొమ్మిదిరౌండ్ల తర్వాత ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భాగంగా సహచర క్రీడాకారిణి ద్రోణవల్లి హారికతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హంపి టైటిల్‌ను గెలుచుకున్నారు. దాంతో  ఐదు రేటింగ్‌ పాయింట్లను ఖాతాలో వేసుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి రెండో స్థానాన్ని సాధించారు. 

టైటిల్‌ గెలిచిన తర్వాత హంపి మాట్లాడుతూ..  ‘కెయిన్స్‌ కప్‌ సాధించడం ఒక సరికొత్త అనుభూతిని తీసుకొచ్చింది. నేను వరల్డ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగినా అది నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఏడో రౌండర్‌లో అలెగ్జాండర్‌ కౌస్టినియక్‌తో జరిగిన మ్యాచ్‌ చాలా కఠినంగా జరిగింది. అయినా ఆమెపై ఉన్న విజయాల రికార్డును కొనసాగించి గెలుపును అందుకున్నాను. అదే నేను టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించింది’ అని హంపి తెలిపారు. ఇక హారిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. 

మరిన్ని వార్తలు