అదే నా టార్గెట్‌: కృనాల్‌

25 Aug, 2018 11:57 IST|Sakshi

ముంబై: ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున మెరుగ్గా ఆడిన కృనాల్ పాండ్యా.. భారత-ఎ జట్టులోనూ మెరిశాడు.  దాంతో ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా భారత టీ20 జట్టులో కృనాల్‌ను ఎంపిక చేశారు. అయితే తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం కృనాల్‌కు దక్కలేదు.  కాగా, తన టార్గెట్‌ భారత్ తరఫున ఆడటమేనని కృనాల్‌ తాజాగా వెల్లడించాడు. దానిలో భాగంగానే తన ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

‘నా క్రికెట్ కెరీర్‌ చాలా గొప్పగా సాగుతోంది. మూడేళ్ల నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ.. ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు భారత్ -ఎ జట్టు‌లో ఆడుతున్నా.. ఇలానే టోర్నమెంట్లు ఆడుతూ టీమిండియా తరఫున ప్రపంచకప్ 2019లో ఆడాలనేది నా  లక్ష్యం ఆ దిశగానే గత కొంతకాలంగా అడుగులు వేస్తున్నా.. తప్పకుండా నా కలని నెరవేర్చుకుంటా’ అని కృనాల్  ధీమా వ్యక్తం చేశాడు.

ఎడమచేతి వాటం బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేసే కృనాల్ పాండ్య ఐపీఎల్ మూడు సీజన్లలో 708 పరుగులు చేసి 28 వికెట్లు పడగొట్టాడు. మిడిలార్డర్‌లో హిట్టింగ్ చేస్తూ అమాంతం స్కోరు పెంచడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఈ ఆల్‌రౌండర్ ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పే వికెట్లతో సెలక్టర్లను ఆకర్షించాడు. మరొకవైపు అతని సోదరుడు హార్దిక్ పాండ్యా.. భారత జట్టులో రెగ్యులర్‌ ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు