ఆ వికెట్‌ కోసం కృనాల్‌ పట్టుబట్టాడు: రోహిత్‌

5 Nov, 2018 12:02 IST|Sakshi

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లతో పాటు రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండేలు ఆశించిన మేర రాణించనప్పటికీ దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యాలు ఆదుకోవడంతో భారత్‌ చివరకు గట్టెక్కింది.

లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కృనాల్‌ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, భారత్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు మాత్రం కృనాల్‌ అడిగి మరీ బౌలింగ్‌ తీసుకున్న విషయాన్ని మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. ‘ విండీస్‌ కీలక ఆటగాడు పొలార్డ్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో నేను బౌలింగ్‌ చేస్తానని కృనాల్‌ అడిగాడు. ఆ వికెట్‌ కోసం కృనాల్‌ పట్టుబట్టీ మరీ బౌలింగ్‌ చేశాడు. అలా అడిగా బౌలింగ్‌ చేయడమే కాదు.. పొలార్డ్‌ వికెట్‌ను కూడా కృనాల్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడే పొలార్డ్‌ను కృనాల్‌ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్‌ చేస్తానని అడగటానికి ఒక కారణం. ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్‌ చేసి చూపెట్టాడు. ఇలా ప్రతీ క్రికెటర్‌ తమ తమ చాలెంజ్‌లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్‌కు కావాల్సింది ఏముంటుంది’ అని రోహిత్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు