అదే నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

23 Jul, 2019 11:41 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకున్న కృనాల్‌ పాండ్యా అక్కడ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు. కరీబియన్‌ దీవుల్లో భారత -ఏ జట్టు తరఫున మెరిసిన కృనాల్‌.. అదే ఫామ్‌ను తిరిగి కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేసున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో మాట్లాడాడు.‘ నేను వెలుగులోకి వచ్చానంటే అందుకు కారణం ఐపీఎల్‌. ఆపై ముంబై ఇండియన్స్‌కు ఆడటమే నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌. ఐపీఎల్‌లో అనుభవించే ఒత్తిడి భిన్నంగా ఉంటుంది. టోర్నీలో ఎంతో కష్టపడతాం కాబట్టి ఐపీఎల్‌ విజేతగా నిలిస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది.  

ఇక భారత్‌-ఏ తరఫున పర్యటించడం నాకెంతో ఉపయోగపడింది. సీనియర్‌ జట్టుకు రాక ముందే అక్కడ ఆడి అనుభవం సంపాదించడం ఎప్పుడూ మేలే. ఇప్పుడు వెస్టిండీస్‌ పర్యటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా చాలా క్రికెట్‌ ఆడనుంది. బ్యాటు, బంతితో నిలకడగా రాణించాలని పట్టుదలతో ఉన్నా’ అని కృనాల్‌ పాండ్య వెల్లడించాడు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని చూసి ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు సీనియర్‌ పాండ్య ఇలా సమాధానం ఇచ్చాడు. ‘కోహ్లి నుంచి తీరని దాహం, నిలకడగా ఆడడం నేర్చుకోవాలి. ఈ ఆటలో మహీ భాయ్‌ అత్యుత్తమ ఫినిషర్‌. ఓపికగా ఉండి జట్టు కోసం మ్యాచ్‌లు ముగించడాన్ని అతడి నుంచి నేర్చుకొంటాను. భారత క్రికెట్‌లో కానీ, వరల్డ్‌ క్రికెట్‌లో కానీ ధోని కంటే అత్యుత్తమ ఫినిషర్‌ లేరనేది నా అభిప్రాయం’ అని కృనాల్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు