కివీస్ ప్యాకప్‌

23 Jan, 2019 10:33 IST|Sakshi

చెలరేగిన బౌలర్లు.. 157 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌

నేపియర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. కుల్దీప్‌ (4/39), షమీ(3/19), చహల్‌( 2/43), కేదార్‌ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్లు గుప్టిల్‌(5), మున్రో(8)లను మహ్మద్‌ షమీ తన వరుస ఓవర్లలో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్‌(11), రాస్ టేలర్‌(22) లను చహల్‌ పెవిలియన్‌కు పంపించాడు. 

విలియమ్సన్ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తనదైన శైలిలో సారథి విలియమ్సన్‌ రాణించాడు. టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. మెల్లిగా స్కోర్‌ను పెంచే ‍ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వన్డే కెరీర్‌లో 36వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాస్‌ టేలర్‌తో 34 పరుగులు, నికోలస్‌తో 31 పరుగుల భాగస్వామ్యాన్ని విలియమ్సన్‌ నమోదు చేశాడు. నికోలస్‌(12) క్రీజులో నిలదొక్కుకున్నాడని అనుకున్న తరుణంలో.. జాదవ్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగడు. సాన్‌ట్నర్(14)ను షమీ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. 

ముగించిన కుల్దీప్‌
కివీస్ పతనాన్ని మహ్మద్‌ షమీ ఆరంభించగా.. కుల్దీప్‌ ముగించాడు. ప్రమాదకరంగా మారుతున్న విలియమ్సన్‌(64)ను ఔట్‌ చేసిన ఈ లెఫ్టాండర్‌ బౌలర్‌.. అనంతరం టెయిలెండర్ల భరతం పట్టాడు. బ్రాస్‌వెల్‌(7), ఫెర్గుసన్‌(0), బౌల్ట్‌(1) వికెట్లను పడగొట్టి కివీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో టీమిండియా ముందు 158 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ నిర్దేశించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా