రెండో వన్డేలోనూ భారత్‌దే విజయం

26 Jan, 2019 14:31 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా  న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. కివీస్‌ను 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్ 90 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసిన భారత్‌ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. మార్టిన్‌ గప్టిల్‌(15), విలియమ్సన్‌(20), మున్రో(31), రాస్‌ టేలర్‌(22), టామ్‌ లాధమ్‌(34), గ్రాండ్‌ హోమ్‌(3), హెన‍్రీ నికోలస్‌(28), ఇష్‌ సోధీ(0)లు వరుసగా క‍్యూకట్టడంతో కివీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. బ్రాస్‌వెల్‌(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ కివీస్‌ను గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ వెన్నువిరవగా, భువనేశ్వర్‌ కుమార్‌, చహల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. షమీ, కేదర్‌ జాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.



లక్ష్య ఛేదనలో ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించిన కివీస్‌ 15 ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టిన కివీస్‌ తిరిగి తేరుకోలేకపోయింది. భారత బౌలర్ల పదునైన బంతులకు దాసోహమై ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ల  హాఫ్‌ సెంచరీలకు తోడు విరాట్‌ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించారు. చివర్లో కేదర్‌ జాదవ్‌(22 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు