ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఫీట్..

27 Apr, 2017 20:30 IST|Sakshi
ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండోసారి..

పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 10 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ పై 7 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ ప్లేయర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే ఓవర్లో స్టంప్ ఔట్ ద్వారా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్. తద్వారా ఐపీఎల్ లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. 2009లో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్లో అమిత్ మిశ్రా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై తొలిసారి ఈ ఫీట్ నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల తర్వాత కుల్దీప్ ఆ ఘనతను సాధించాడు.

బుధవారం జరిగిన మ్యాచ్ లో 15వ ఓవర్‌లో వరుసగా 4,6 బాదిన ఎంఎస్ ధోనీ మరుసటి ఓవర్‌లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. 18వ ఓవర్ కుల్దీప్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేందుకు ధోనీ ముందుకు రాగా కీపర్ రాబిన్ ఉతప్ప స్టంప్స్ పడగొట్టాడు. దీంతో 148 పరుగుల వద్ద ధోనీ(16 బంతుల్లో 23) మూడో వికెట్ రూపంలో నిరాశగా వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఐదో బంతికి అంచనా వేయని పుణే ప్లేయర్ మనోజ్ తివారీ(1) ముందుకొచ్చి ఆడాలని చూడగా బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఉతప్ప వికెట్లను గిరాటేయడం తివారీ పెవలియన్ బాట పట్టడం జరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో స్టంప్ ఔట్ ద్వారా రెండు వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫీట్ నమోదుకావడంపై యంగ్ బౌలర్ కుల్దీప్ హర్షం వ్యక్తంచేశాడు.

మరిన్ని వార్తలు