ఆసీస్‌ క్రికెటర్‌ వల్లే కుల్దీప్‌కు వికెట్లు దక్కాయి

5 Jan, 2019 19:31 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఏమైనా అద్భుతాలు జరిగితే డ్రా అయ్యే అవకాశం తప్పా.. కోహ్లి సేనకు ఓటమి అవకాశమే లేదు. దీంతో కంగారూల గడ్డపై తొలి చారిత్రక సిరీస్‌ విజయానికి టీమిండియా చేరువలో ఉంది. సిడ్నీ టెస్టులో అనూహ్యంగా ఇద్దరు స్పిన్నర్లతో దిగాలన్న సారథి విరాట్‌ కోహ్లి వ్యూహం ఫలించింది. 

చివరి టెస్టు మూడో రోజు ఆటలో స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా- కుల్దీప్‌ యాదవ్‌లు ఆసీస్‌ ఆటగాళ్లను కట్టడి చేశారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సారథి టిమ్‌ పైన్‌ వికెట్‌ను సాధించిన కుల్దీప్‌ మూడో రోజు ఆటలో హైలెట్‌గా నిలిచాడు. పైన్‌ను అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించాడు. అయితే ఈ క్రెడిట్‌ ఆసీస్‌ మాజీ దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌కే చెందుతుందని భారత మాజీ ఆటగాడు మురళీ కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. 

మూడో రోజు ఆట ముగిసిన అనంతరం చర్చా కార్యక్రమంలో మురళీ కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు ప్రారంభానికి ముందు కుల్దీప్‌కు వార్న్‌ సలహాలు ఇచ్చాడు. కుల్దీప్‌ బౌలింగ్‌ యాక్షన్‌లోని చిన్న లోపాలను అతడికి వివరించాడు. ఆ సలహాలు సిడ్నీ టెస్టులో కుల్దీప్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయని భావిస్తున్నా. టిమ్‌ పైన్‌ ఔట్‌ తర్వాత ఇది స్పష్టమైంది’ అంటూ కార్తీక్‌ వివరించాడు. ఇక మైకెల్‌ క్లార్క్‌ కూడా కుల్దీప్‌ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.  
 

మరిన్ని వార్తలు