వికెట్ల వేటలో కుల్దీప్‌ ఘనత!

26 Jan, 2019 15:42 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్‌ నాలుగు వికెట్లతో రాణించి భారత్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలోనూ నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్‌.. అదే జోరును రెండో వన్డేలో సైతం కొనసాగించాడు. ఫలితంగా 77 వన్డే వికెట్లను కుల్దీప్‌ సాధించాడు. ఇది కుల్దీప్‌కు 37వ వన్డే మ్యాచ్‌.

అయితే 37 వన్డే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కుల్దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు. తొలి 37 వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్తాన్‌) మొదటి స్థానంలో ఉండగా, కుల్దీప్‌ రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆ సమయానికి రషీద్‌ సాధించిన వికెట్లు 87.  ఈ క్రమంలోనే సక్లయిన్‌ ముస్తాక్‌(పాకిస్తాన్‌), మిచెల్‌ స్టార్క్‌( ఆస్ట్రేలియా)లను కుల్దీప్‌ అధిగమించాడు. ఇక ఆ తర్వాత స్థానాల్లో అజంతా మెండిస్‌(శ్రీలంక) 72 వికెట్లతో నాల్గో స్థానంలో ఉండగా, షేన్‌ బాండ్‌, హసన్‌ అలీలు 71 వికెట్లతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్‌ కావడంతో కివీస్‌కు మరో ఓటమి ఎదురైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా